అక్రమ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు
లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అక్రమ పార్కింగ్ పై కఠిన చర్యలు...
డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమానులదే బాధ్యత
జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాలు
ములుగు, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : ములుగు జిల్లాలో(Mulugu District) ఇసుక లారీల ద్వారా జరుగుతున్న అతివేగ ప్రయాణం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారులపై(Speeding, reckless driving, highways) అక్రమ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై పోలీస్ శాఖ(Police Department) ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల ప్రాణ భద్రతకు విఘాతం కలిగించే విధంగా వాహనాలు నడిపినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా లారీలను నిలిపినా సంబంధిత వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్(Sudheer Ramnath Kekan) తెలిపారు.
ఇసుక లారీ డ్రైవర్లు నిర్దేశిత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా లేదా ప్రమాదకరంగా వాహనాలు నడపరాదని సూచించారు. ముఖ్యంగా జనావాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, విద్యాసంస్థలు, రద్దీగా ఉండే కూడళ్ల వద్ద అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఆదేశించారు. రహదారులపై, ప్రధాన కూడళ్ల వద్ద, ప్రజలకు మరియు ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ఇసుక లారీలను అక్రమంగా పార్కింగ్ చేయరాదని, వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇసుక లారీల యజమానులు తమ డ్రైవర్లకు రహదారి భద్రతా నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా వాహన డ్రైవర్లతో పాటు యజమానులను కూడా బాధ్యులను చేస్తామని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాహనాలను చట్ట ప్రకారం సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఎవరైనా వ్యక్తులు తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించిన, ఏదైనా వాహనం నిర్లక్ష్యంగా, ప్రజలకు హాని కలిగించేలా నడుపుతున్నట్టు చూసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కి, అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. తద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ములుగు జిల్లాలోనీ సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై వర్తించే చట్టాల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రహదారి భద్రతను పరిరక్షించడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, ప్రమాదాలను నివారించడమే ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని, ప్రజల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి ఉల్లంఘనలనూ సహించేది లేదని, ఇసుక లారీ యజమానులు, డ్రైవర్లు పోలీస్ శాఖకు సహకరిస్తూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు కూడా రోడ్డు భద్రతలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.