నాయి బ్రాహ్మణుల సేవలను గుర్తించాలి
వెంకటాపూర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నాయి బ్రాహ్మణుల సేవలను ప్రభుత్వాలు గుర్తించి వారికి అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని నాయి బ్రాహ్మణుల సంఘం మండల అధ్యక్షుడు ప్రభాకర్(Prabhakar, Mandal President of the Brahmin Association) కోరారు. గురువారం మండల కేంద్రంలో మండల ప్రధాన కార్యదర్శి అనిల్ అధ్యక్షతన నిర్వహించిన సంఘం సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ..
నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వాలు సరైన గుర్తింపు, సదుపాయాలు కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మేడారం జాతరలో నాయి బ్రాహ్మణులు తలనీలాల సేకరణలో సేవలందిస్తున్నారని, వారి వృత్తి ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మేడారం జాతరలో జిల్లాలోని 18 సంవత్సరాలు పైబడిన నాయి బ్రాహ్మణులందరికీ ఉచిత గుర్తింపు కార్డులు అందించాలని, నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం సంఘ సభ్యులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షుడు మధు, ముఖ్య సలహాదారులు రాజు, మొగిలి, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, శరత్, కోశాధికారి కోటి, ప్రచార కార్యదర్శి శ్రీనివాస్, కార్యదర్శి సతీష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.