నామినేటెడ్ ఎమ్మెల్సీలో బీసీలకు అవకాశం
బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్
దామరచర్ల: వచ్చే నెలలో గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న నామినేటెడ్ ఎమ్మెల్సీ(Nominated MLC) పదవిలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీలకు అవకాశం కల్పించాలని కోరుతూ... హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఎన్నికల సమయంలో ఓటర్లుగానే మిగిలిపోతున్నారని,రాజకీయ పదవులు,నిర్ణయాధికారంలో మాత్రం తగిన ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారని అన్నారు.
ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు సమయంలో కూడా ఆర్థిక స్థోమత లేదనే సాకుతో బీసీలకు అవకాశాలు నిరాకరించారని విమర్శించారు.బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా సామాజిక న్యాయం సాధ్యంకాదని స్పష్టం చేశారు. వచ్చే నెలలో గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అర్హత, సామాజిక సేవ, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన బీసీ నాయకుడికి అవకాశం కల్పించి, బీసీల ఆత్మగౌరవాన్ని గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం, కులగణన, బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ స్ఫూర్తికి అనుగుణంగా బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడం లేదని విమర్శించారు.సామాజిక న్యాయం మాటలకే పరిమితం కాకుండా,ఆచరణలోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీలకు గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిలో అవకాశం కల్పించి, కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల తన నిబద్ధతను నిరూపించుకోవాలని జాజుల లింగం గౌడ్ కోరారు.