కంటి చూపుకు కొండంత భరోసా..

01-11-2026 | 09:45pm

-పేదలకు అండగా కోమటిరెడ్డి దంపతులు..

- 623 మందికి కంటి పరీక్షలు.. 228 మందికి శస్త్రచికిత్సలకు ఎంపిక

- ఇప్పటివరకు 3,087 మందికి కంటి ఆపరేషన్లు.. 6,075 మందికి కళ్లద్దాల పంపిణీ

మునుగోడు, నవంబర్ 1 (విజయక్రాంతి): కంటి సమస్యలతో ఎవరూ ఇబ్బందులు పడకూడదన్న సంకల్పంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్(Komati Reddy Susheelamma Foundation) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు పేదలకు కొండంత భరోసా కల్పిస్తున్నాయి. ఇప్పటికే 17 విడతల్లో వేలాది మందికి సేవలందించిన ఫౌండేషన్.. ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో 18వ విడత శిబిరాన్ని నిర్వహించింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ.. కంటి చూపు ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని, నియోజకవర్గంలో ఎవరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్నదే తమ ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. శస్త్రచికిత్సలకు ఎంపికైన వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైద్య ఖర్చుల బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.

ఈ విడత శిబిరంలో 623 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 228 మంది శస్త్రచికిత్సలకు ఎంపికయ్యారు. వీరిలో 109 మందిని వెంటనే హైదరాబాద్‌లోని శంకర నేత్ర వైద్యశాలకు తరలించారు. ఇప్పటివరకు నిర్వహించిన 18 విడతల శిబిరాల్లో మొత్తం 14,053 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 3,087 మందికి శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. మరో 6,075 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఈ వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. శిబిరానికి వచ్చిన వారికి నిర్వాహకులు భోజన సదుపాయం కల్పించారు.

మరిన్ని వార్తలు