తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలురు
3 గంటల్లోనే తల్లిదండ్రులకు అప్పగించిన ఘట్ కేసర్ పోలీసులు
ఘట్ కేసర్, నవంబర్ 1 (విజయక్రాంతి) : తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలురను 3 గంటల్లోనే ఘట్ కేసర్ పోలీసులు(Ghatkesar Police) గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి సుమారు 8:40 గంటలకు కొండాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు వసంత, ములుగురం లలిత తమ కుమారులు ఓర్సు శివప్రసాద్ (12), ములుగురం యశ్వంత్ (13) కనిపించడం లేదని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు.
ఫిర్యాదు అందిన వెంటనే ఇన్స్పెక్టర్ పి. కిరణ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు ఎ. శేఖర్, ఎ. రాఘవేంద్ర పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలుర ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుళ్లు సత్యనారాయణ, రాజు సమన్వయంతో చేపట్టిన వేగవంతమైన గాలింపు చర్యల ఫలితంగా ఫిర్యాదు అందిన కేవలం 3 గంటల్లోనే ఇద్దరు బాలురను వరంగల్ రైల్వే స్టేషన్లో గుర్తించారు.
విచారణలో భాగంగా తాము పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారని, దీంతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయామని బాలురు తెలిపారు. అనంతరం ఇద్దరు బాలురను క్షేమంగా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, తగిన కౌన్సెలింగ్ నిర్వహించిన తరువాత తల్లిదండ్రులకు అప్పగించారు.
తల్లిదండ్రులకు ఘట్ కేసర్ పోలీసుల విజ్ఞప్తి
పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని వారి సమస్యలను ఓపికగా విని, అర్థం చేసుకుని ప్రేమతో మార్గనిర్దేశం చేయాలని సీఐ కిరణ్ సూచించారు. పిల్లలు కనిపించకుండా పోయిన సందర్భంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు.