23న సీజేపీ దేశవ్యాప్త ఆందోళన
- సీఈసీని రక్షించేందుకు స్వదేశీయులపై కేంద్రం యుద్ధం
- నిరసనల అణచివేతకు ఢిల్లీలో అసాధారణ ఆంక్షలు విధింపు
- జ్ఞానేష్‌కుమార్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలి
- నిర్బంధంలో సీజేపీ సభ్యులతో సహా అందరినీ విడుదల చేయాలి
- జంతర్ మంతర్‌పై డీనోటిఫైని ఎత్తివేయాలి
- కాక్రోచ్ జనతాపార్టీ నేత అభిజీత్ దీప్కే ఆరోపణలు
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 15: కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party) ఈ నెల 23 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేష్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
సీఈసీని కాపాడటానికి కేంద్రం ‘తన సొంత పౌరులపై యుద్ధం’ చేస్తోందని సీజేపీ నేత అభిజీత్ దీప్కే(CJP leader Abhijeet Dipke) సంచలన ఆరోపణలు చేశారు. నిరసనకారులను వీధుల నుంచి ఈడ్చుకెళ్లడం, మాజీ సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రతిపక్ష నేతలను, సీజేపీ నాయకులను నిర్బంధించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సీఈసీని రక్షించడానికి ప్రధాని మోదీ ప్రభుత్వ వనరులను వాడుకుంటున్నారని, ఎన్నికల సంఘం అధిపతి రాజీనా మాను డిమాండ్ చేస్తున్న నిరసనకారులు, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఓటర్ల తొలగింపు ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించడం కూడా ఇందులో ‘కుట్రే’నని దీప్కే అన్నారు. సీఈసీ రాజీనామా కోరుతూ నిరసన చేస్తు న్న వారి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనా, ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో జరిగిన అవకతవకలపైనా ఆయన, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకురాలు ఐషేఘోష్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్, నటుడు ప్రకాష్‌రాజ్ తదితరులతో కలిసి గురువారం మీడియా సమావేశంలో దీప్కే మాట్లాడారు. ప్రజలు నిరసనల్లో పాల్గొనకుండా నిరోధించడానికి ఢిల్లీలో అసాధారణ ఆంక్షలు విధించారని ఆరోపించారు.
జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, సీజేపీ సభ్యులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లతో పాటు నిర్బంధంలో ఉన్న శాంతియుత నిరసనకారులందరినీ విడుదల చేయాలని, పోలీసుల క్రూరత్వానికి ముగింపు పలకాలని, అలాగే జంతర్ మంతర్‌ను నిర్దేశిత నిరసన ప్రదేశంగా పునరుద్ధరించాలని సీజేపీ, విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ప్రతిపక్ష నాయకులు, అందరినీ నిర్బంధించారని, దేశ చరిత్రలో తొలిసారిగా జ్ఞానేష్ కోసం రైల్వేలను, మెట్రోలను మూసివేశారని దీప్కే అన్నారు.
ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎందుకు రక్షిస్తోందని ఆయన ప్రశ్నించారు. సీఈసీ కోసం ప్రధాని మోదీ, అమిత్‌షా తమ సొంత దేశస్థులపైనే యుద్ధం చేస్తుండడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. నిరసనలను కవర్ చేస్తున్న పాత్రికేయులను కూడా పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారని, వారి వద్ద ప్రెస్ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ వారిని అదుపులోకి తీసుకుని, కెమెరాలను లాగేసుకున్నా రని నేహా బోరా ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, ప్రజలపైనే దాడులకు దిగుతుండడం దారమని ఆమె పేర్కొన్నారు.
‘జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకం గా జరుగుతున్న ఈ ఉద్యమం మొత్తం, ఓటు హక్కు కోసం జరుగుతున్న ఈ పోరాటం ఏ ఒక్క వ్యక్తిదో, ఏ రాజకీయ పార్టీదో, పతాకానిదో లేదా జెండాదో కాదని స్పష్టం చేశారు.- ‘ఓటు హక్కుకు మద్దతు ఇచ్చే గొం తును మీరు జైలుకు పంపుతున్నారు. మీరు సామాన్య ప్రజలను ఈడ్చినప్పుడు, ఆ 13 కోట్ల మంది ప్రజలను ఈడ్చుతున్నట్లే’ అని ఆమె స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 200 సంస్థలు బుధవారం సమావేశమయ్యాయని, జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదేశంగా లేకుండా చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ‘మొత్తం దేశమే జంతర్ మంతర్‌గా మారాలన్నదే మా పిలుపు. ఈ పోరాటం దేశ యువతది’ అని ఆయన పేర్కొన్నారు.