17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ
వీటిలో వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు
విస్మరించిన, యువ, తొలిసారి ఓటరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్
సర్ వివాదం వేళ ఎస్ఎస్ఆర్కు ఈసీ ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకియ(SIR)పై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఓటర్లను చేర్చడం, ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన వారిని కవర్ చేయడంపై దృష్టి సారించింది. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలతో సహా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సంక్షిప్త సవరణ(స్పె
షల్ సమ్మరీ రివిజన్)ను నిర్వహించాలని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తుది జాబితాలను జనవరి 4న ప్రచురిస్తారు. సర్పై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ఎస్ఆర్) అనేది వార్షికంగా తప్పనిసరి అని, దీనిని ప్రత్యేకంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నిర్వహిస్తారని ఈసి సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ఈ 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక, విస్తృతమైన సవరణ పూర్తయింది.
అసోంలో, చట్టపరమైన కారణాల వల్ల ఎస్ఎస్ఆర్కు బదులుగా ప్రత్యేక సవరణ జరిగింది. యువతను చేర్చుకునేందుకు, వచ్చే ఏడాది జనవరి 1న లేదా అంతకంటే ముందు 18 ఏళ్లు నిండే వారిని ఓటరుగా నమోదు కావడానికి అర్హులు. ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్లో ఎన్నికలకు ముందే వారు ఓటర్లుగా మారడానికి వీలుంటుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ‘వచ్చే ఏడాది ప్రారంభంలో’ జరగాల్సి ఉందని ఈసీ తన ఎన్నికల అధికారులకు తెలిపింది.
గురువారం ఈసీ జారీచేసిన ఉత్తర్వుల్లో ‘విస్మరించిన/ యువ/ తొలిసారి అర్హత సాధించిన ఓటర్లను నమోదు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్డాలని’ సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఇచ్చిన సూచనలను ఈసీ ప్రస్తావించింది. ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి ఫారమ్ 6లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇందులో వివాదాస్పద అదనపు ఎస్ఐఆర్ డిక్లరేషన్ ప్రస్తావన లేదు. అర్హులైన ఓటర్లను, ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటు వేసేవారిని నమోదు చేయడంతోపాటు ఓటర్ల జాబితాలోని నమోదులను సరిదిద్దడమే ఎన్నికల జాబితా సవరణ ముఖ్య ఉద్దేశమని ఈసీ పేర్కొంది. ఎస్ఎస్ఆర్లో, ఓటర్ల కోసం బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లరు.
ఎందుకంటే ఎస్ఐఆర్ (సర్) ఇప్పటికే జరిగిపోయింది. ఓటర్లను దాదాపుగా గుర్తించారు. ఎస్ఎస్ఆర్ జరగనున్న రాష్ట్రాల్లో అండమాన్, నికోబార్ దీవులు, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళం, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. అయితే యూపీ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది మే 22న ముగుస్తుంది.
మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలం 2027 మార్చిలో వేర్వేరు తేదీలలో ముగియనున్నాయి. ప్రజా ప్రాతినిథ్య చట్టం, 1950లోని నిబంధనల ప్రకారం, ‘పదవీకాలం ముగియడానికి ఆరు నెలల కంటే ముందే’ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీకి అనుమతి ఉంటుంది. అలాగే, ఇప్పటివరకు ఎస్ఐఆర్ ప్రారంభం కాని హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్లో వాతావరణ పరిస్థితులను బట్టి సవరణ షెడ్యూల్ను తగిన సమయంలో ప్రకటిస్తాం” అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.