యూరప్ రణరంగం
కట్టలు తెంచుకుంటున్న జనాగ్రహం.. అట్టుడుకుతున్న దేశాలు
వీకెండ్ నిరసనలతో ఫ్రాన్స్ ఆగమాగం.. ఒకేరోజు 4లక్షల మంది రోడ్లమీదికి
పారిస్ వీధుల్లో చెలరేగిన హింస
నిరసనకారులపై టియర్ గ్యాస్, లాఠీచార్జ్
అల్బేనియా, ఇటలీ, పోర్చుగల్,స్పెయిన్‌లోనూ ఆందోళనలు
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, జీవనప్రమాణాలు పడిపోవడంపై ఆగ్రహం
పారిస్, అక్టోబర్ 25: యూరప్‌లో జనాగ్రహం(Public Outrage in Europe) కట్టలు తెంచుకుంటున్నది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పడిపోతున్న జీవనప్రమాణాలను తాళలేక లక్షల మంది రోడ్ల మీదికి వచ్చి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్, అల్బేనియా, ఇటలీ, పోర్చుగల్‌లో వీకెండ్ నిరసనలు హోరెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, మాల్స్‌లో లూటీలు, పోలీసులపై తిరుగుబాటు కొనసాగుతున్నది. రెండు నెలలుగా ఈ ఆందోళనలు జరుగు తుండగా ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి.
పారిస్‌లో విధ్వంసం..
ప్రతి వీకెండ్‌లో ఫ్రాన్స్ అట్టుడికిపోతున్నది. శాంతియుత ర్యాలీలతో జనం బయటకు వచ్చి.. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా భగ్గుమంటున్నారు. శనివారం, ఆదివారం కూడా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో శాంతియుత ర్యాలీగా జనం రోడ్లమీదికి వచ్చారు. అయితే.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో విధ్వంసం జరిగింది. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు.
లాఠీచార్జ్‌కు దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన జనం.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. మాల్స్, స్టోర్స్‌లోకి వెళ్లి వస్తువులను లూటీ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థలో సరైన వసతులులేవని, దానికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం,
జీవనప్రమాణాలు కూడా పడిపోయాయని.. వీటన్నింటికీ అధ్యక్షుడి తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఒక్కరోజే పారిస్ వీధుల్లో ఒక లక్షా పదివేల మంది జనం వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 4 లక్షల 10వేల మంది నిరసనల్లో పాల్గొన్నట్లు ఫ్రాన్స్ అంతర్గత భద్రత వ్యవహారాల శాఖ అంచనా వేసింది. పారిస్‌తోపాటు లియోన్, లిల్లే, బోర్డియక్స్ వంటి నగరాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించారు. చాలా ఏరియాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. లూవ్రే, మ్యూజీ డీ ఓర్సే వంటి ప్రముఖ మ్యూజియాలను, మెట్రో స్టేషన్లను మూసివేశారు. దేశవ్యాప్తంగా 70వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు. ఆంక్షలను లెక్కచేయకుండా జనం రోడ్లమీదికి వస్తూనే ఉన్నారు.
ఇటీవల చాలా మాల్స్, స్టోర్స్ నుంచి జనం వస్తువులను ఎత్తుకెళ్లడంతో మాల్స్, స్టోర్స్ యాజమాన్యాలు తమ వ్యాపారాలను బంద్ పెట్టాయి. షాపుల తలుపులను పగులగొట్టి మరీ జనం అందినకాడికి ఎత్తుకెళ్లారు.
ఎల్లో వెస్ట్స్ ఉద్యమం తీవ్రం..
ఫ్రాన్స్‌లో ఎల్లో వెస్ట్స్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 2018లో మొదలైన ఈ పోరాటం.. ఇప్పుడు పీక్స్‌కు చేరింది. పసుపు రంగు జాకెట్లను ధరించి నిరసనల్లో పాల్గొనడమే ఎల్లో వెస్ట్స్ ఉద్యమం. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా 2017లో ఇమ్మాన్యుయెల్ మ్యాక్రాన్ బాధ్యతలు చేపట్టిన ఏడాదికి ఎల్లో వెస్ట్స్ ఉద్యమం పురుడుపోసుకుంది. 2018 నవంబర్, డిసెంబర్‌లో లక్షల మంది జనం రోడ్లమీదికి వచ్చి..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఇంధన ధరలు పెరగడంతోనే ఈ ఉద్యమం మొదలైంది. 50ఏండ్లలో ఎన్నడూ జరగనంత విధ్వంసం 2018లో జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే తీరుగా జనం పోరాటం చేస్తున్నారు. ఎల్లో వెస్ట్స్ ఉద్యమం కొనసాగుతుందని, అధ్యక్షుడు మ్యాక్రాన్ తీరు మారే వరకు, జనం బతుకులు మారే వరకు ఆపబోమని వామపక్ష పార్టీ నేత జీన్ లుక్ మెలన్‌షోన్ హెచ్చరించారు.
ఈ నెల 31న మరో విడత నిరసనలకు ‘ఎల్లో వెస్ట్స్’ టీమ్ పిలుపునిచ్చింది. ఏడాదిలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చడం మ్యాక్రాన్‌కు తలనొప్పిగా మారింది. నిరసనల వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.
పోర్చుగల్, ఇటలీ, స్పెయిన్‌లోనూ..!
అల్బేనియా, పోర్చుగల్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లోనూ వీకెండ్ నిరసనలు కంటిన్యూ అయ్యాయి. ఇటలీలోని మిలన్‌లో శనివారం భారీగా జనం రోడ్లమీదికి రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆదేశించారు. పోర్చుగల్ రాజధాని లిస్బన్, అబ్లేనియా రాజధాని టిరానా, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ కూడా నిరసనలతో అట్టుడికిపోయాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం కనిపించింది. పలు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు.
వలసదారుల వల్లే: ట్రంప్
యూరప్‌లో మరీ ముఖ్యంగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వలసదారులను దేశంలోకి అనుమతివ్వడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ‘ఆ దేశం యథేచ్ఛగా వలసదారుల ప్రవేశానికి అనుమతిచ్చింది. ఆ ఫలితం కండ్ల ముందుకు కనిపిస్తున్నది. ఆ వలసదారులు ఫ్రాన్స్‌ను ఇష్టపడరు..
ఫ్రాన్స్ ప్రజలనూ ఇష్టపడరు.. అక్కడి స్మారకాలను, ప్రదేశాలను ద్వేషిస్తారు. అందుకే విధ్వంసానికి దిగుతున్నారు. వలసదారులను ప్రోత్సహించడం మంచిది కాదు. అమెరికాలో అలాంటి పరిస్థితులు రానివ్వబోం’ అని మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్జియాలో వ్యాఖ్యానించారు.