ముక్కు మూసుకోవాల్సిందే!

26-10-2026 | 05:15am

ప్రజల పాలిట నరకం

  1. ఆదిభట్ల సర్కిల్ కార్యాలయం ఎదుటే ఏరులై పారుతున్న మురుగునీరు
  2. పది రోజులుగా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ / మున్సిపల్ అధికారులు
  3. దుర్వాసనతో వాంతులు,తలనొప్పులు..
  4. ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న దుకాణదారులు 

ఆదిభట్ల, అక్టోబర్ 25 (విజయక్రాంతి): అధికారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన కార్యాలయం(Headquarters) పక్కనే మురుగునీరు ఏరులై పారుతున్నా.. పాలకులు, సిబ్బంది కనీసం కన్నుతెరిచి చూడకపోవడంపై ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని(Adibhatla Circle jurisdiction) తొర్రూరు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సర్కిల్ కార్యాలయానికి అతి సమీపంలో గత పది రోజులుగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. సమీపంలోని ఒక హోటల్ నుంచి నిరంతరం వెలువడుతున్న వ్యర్థాలు, మురుగునీటితో సీసీ రోడ్డంతా ఒక చెరువును తలపిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఇదే మార్గం గుండా మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ వాహనాల్లో వెళ్తుంటా రు.

రోడ్డుపైనే మురుగు కుంటలా మారిన దృశ్యం కళ్లెదుటే కనిపిస్తున్నా, ఏ ఒక్క అధికారి కూడా సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడం గమనార్హం. అధికారుల ఇళ్ల ముందు లేదా వారి కార్యాలయాల వద్ద ఇలాంటి పరిస్థితి ఉంటే ఊరుకుంటారా?‘ అని తొర్రూరు నివాసితులు మండిపడుతున్నారు. మురుగు నీటి దుర్వాసన ప్రభావం స్థానిక వ్యాపారులపై తీవ్రంగా పడింది. దుకాణాల ముందే మురుగు నిలవడంతో కస్టమర్లు అటువైపు కన్నెత్తి చూడటానికే ఇష్టపడటం లేదు.

వ్యాధుల ముప్పు..

నిల్వ ఉన్న మురుగునీటి వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. భరించలేని దుర్వాసన కారణంగా బాటసారులు, వాహనదారులు ముక్కులు మూసుకుని ప్రయాణిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర శ్వాసకోస సమస్యలు, వాంతు లు, తలనొప్పితో మంచాన పడుతున్నారు.

స్థానికుల డిమాండ్లు..

వెంటనే సక్షన్ యంత్రాలతో రోడ్డుపై మురుగునీటిని తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లి ఫాగింగ్ చేయాలి. లీకేజీకి కారణమవుతున్న హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో పాటు, డ్రైనేజీ పైప్లైన్కు శాశ్వత మరమ్మతులు చేపట్టాలి.

రాబోయే 24 గంటల్లోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించి, రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానిక ప్రజలు, దుకాణదారులు హెచ్చరించారు.

డ్రైనేజీ దుర్వాసన భరించలేకపోతున్నాం. 

‘కొద్దిసేపు షాపులో ఉంటేనే వాంతులు వచ్చే పరిస్థితి ఉంది. రోజువారీ గిరాకీలు లేక ఉపాధి దెబ్బతింటోంది. షాపులో ఉండలేక తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోతున్నాం..’ అంటూ హెయిర్ కటింగ్ షాప్ నిర్వాహకుడు విజయ్‌తో పాటు పలువురు షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు