ఇది రాజకీయ యుద్ధం..సామాన్యులే సమిధలు!
జెన్ నడుం బిగించాలి..
ఈ చీకటికూపం నుంచి సమాజానికి విముక్తి లభించాలంటే ఒక్కటే మార్గం కనిపిస్తోంది. సంప్రదాయ, కుళ్లిపోయిన రాజకీయాన్ని మార్చే శక్తి కేవలం నేటి యువత.. అదే ‘జెన్ - జీ’ తరానికి మాత్రమే ఉంది. పాతకాలపు ఆలోచనలు, స్వార్థ ప్రయోజనాలు, కుల-, మత, -ధన రాజకీయాలకు అతీతంగా ఆలోచించగల సామర్థ్యం యువతకు ఉంది. రాజకీయ నాటకాలను, వ్యవస్థల లోపాలను ప్రశ్నించే చైతన్యం వారిలోనే ఉంది. అందుకే, కుప్పకూలుతున్న వ్యవస్థలను ప్రక్షాళన చేయడానికి, ధర్మాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠించడానికి, సమాజాన్ని, ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి నేటి యువత ముందుకు రావాలి.
ఓ మహాత్మా ఓ మహర్షి.. ఏది ధర్మం? ఏది న్యాయం?
రాజకీయమంటే(Politics) ప్రజాసేవ, సమాజ శ్రేయస్సు అనే రోజులు పోయాయి. నేడు రాజకీయం(Politics) ఒక వికృత యుద్ధంగా మారిపోయింది. నైతి క విలువలకు, ప్రజా ప్రయోజనాలకు చోటులేని ఈ ఆధిపత్య పోరులో సమాజంలోని సకల వ్యవస్థలూ ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. వ్యవస్థలపై నమ్మకం పోతోంది.
అధర్మం ధర్మాన్ని, అన్యాయం న్యాయాన్ని మింగేస్తున్న ఈ పరిస్థితి నేటి సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం.. న్యాయానికి అన్యాయానికి మధ్య సంఘ ర్షణ.. ప్రజాసేవకు స్వార్థానికి మధ్య సమరం.. ఇదే నేటి రాజకీయ వ్యవస్థలో కనిపిస్తున్న వింత పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులను ఎన్నుకుంటున్నా.. చివరికి అదే ప్రజలు పాలకుల నిర్ణయాలకు, అధికారుల నిర్లక్ష్యానికి, వ్యవస్థల వైఫల్యానికి బలవుతున్నారు.
ఒకప్పుడు రాజకీయాలు ప్రజాసేవకు వేదికలుగా ఉండేవి. ప్రజల సమస్యలను పరిష్కరించడం, సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యతగా భావించేవారు. కానీ నేటి రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, కాంట్రాక్టులు, భూవివాదాలు, లిక్కర్ వివాదాలు, అవినీతి ఆరోపణలు, ఉచిత పథకాలే ఎక్కడ చూసినా కనపడుతున్నాయి..
అవే ప్రజాస్వామ్యాన్ని నడుపుతున్నాయనేది నిర్వివాదాంశం. ఒకరు దొంగ అని ఆరోపిస్తే, ప్రతిగా నువ్వు గజదొంగవంటూ ఎదురు దాడి చేయడం పరిపాటిగా మారుతోంది. ప్రజలకు కావాల్సిన సమాధానాలు మాత్రం ఎక్కడా.. ఎప్పుడూ కనిపించడం లేదు. వినిపించడం లేదు.
ధర్మయుద్ధమా? అధికార యుద్ధమా?
మహాభారతంలో పాండవులు, కౌరవుల మధ్య జరిగిన యుద్ధం కేవలం రాజ్యం కోసం జరిగిన పోరాటం కాదు. అది ధర్మం, అధర్మం మధ్య సంఘర్షణకు ప్రతీకగా నిలిచింది. నేటి రాజకీయాలను పరిశీలిస్తే అలాంటి పోలికలు గుర్తుకు రాకమానవు. ప్రతి పార్టీ తామే ధర్మపక్షమని ప్రకటించుకుంటుంది. ప్రత్యర్థులను అధర్మపరులుగా చిత్రీకరిస్తుంది. కానీ నిజంగా ప్రజల పక్షాన నిలబడుతున్నది ఎవరు? సత్యం కోసం పోరాడుతున్నది ఎవరు? ప్రజాధనాన్ని కాపాడుతున్నది ఎవ రు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది.
ఫ్రాడ్, భూ కుంభకోణాలు, కాంట్రాక్టుల వ్యవహారాలు, మద్యం విధానాలపై ఆరోపణలు, ఓట్ల కోసం ఉచిత పథకాల ప్రకటనలు.. ఇలా రాజకీయ చర్చలు ఎన్నో అంశాల చుట్టూ సాగుతున్నాయి. ఆరోపణలు చేసే వారు వాటిని నిరూపించాలి. ఆరోపణలు ఎదుర్కొనే వారు ప్రజలకు వాస్తవాలు వివరించాలి. విచారణ సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలి. కానీ రాజకీయ విమర్శల హోరు మధ్య అసలు సమస్యలు మరుగున పడితే, చివరికి మిగిలేది శూన్యమే.
ప్రజాస్వామ్యానికి ధర కడుతున్నామా?
ఓటు అనేది ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. కానీ ఆ ఓటును రూ.500కు లేదా మద్యాన్ని ఇచ్చి కొనుగోలు చేయాలనే ధోరణి పెరిగితే, ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడతాయి. తాత్కాలిక ప్రయోజనం కోసం ఓటును అమ్ముకున్న ప్రజలు, ఆ తర్వాత ఐదేళ్లపాటు తమ సమస్యల పరిష్కారం కోసం అదే నాయ కుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు.
అదే మన కండ్లముందు కనపడుతోంది కూడా. ఓటు కొనుగోలు చేసేవారు ప్రజాసేవ కంటే పెట్టుబడిపై లాభం సంపాదించాలనే ఆలోచనతో సాగుతుండటమే అసలైన ప్రమాదం. ఉచిత పథకాలు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడవచ్చు. కానీ అవి ఆర్థిక బాధ్యతతో, దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమలుకావాలి. సంక్షేమం పేరుతో రాజకీయ పోటీ సాగుతూ, విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సమస్యలు నిర్లక్ష్యానికి గురైతే నష్టపోయేది సామాన్యుడే.
అధికారుల వ్యవస్థలోనూ మార్పు అవసరం..
వ్యవస్థల నిర్వీర్యతను గమనిస్తే, మనం మళ్లీ బ్రిటిష్ పాలన నాటి బానిసత్వంలోకి వెళ్తున్నామా అనే సందే హం కలుగుతోంది. ఒకప్పుడు బ్రిటిష్ రాజ్ వ్యవస్థలో డిస్ట్రిక్ట్ కలెక్టర్కు సర్వాధికారాలు ఉండేవి. కానీ నేడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా ‘కలెక్టర్ల’లా ప్రవర్తిస్తున్నారు.
పరిపాలన అందించాల్సిన కలెక్టర్లను చివరకు ‘సర్పంచుల’ స్థాయికి దిగజార్చి, తమ ఆజ్ఞాపరిపాలన కింద బానిసలుగా మార్చేసుకున్నారు. ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యత అని మరచిన ప్రజాప్రతినిధులు.. ప్రజాధనాన్ని దోచుకోవడం, అక్రమంగా సంపాదించడం తమ ప్రాథమిక హక్కుగా భావిస్తున్నారు.
స్వాతంత్య్రం తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారుల పనితీరును ప్రశ్నించవచ్చు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే పరిపాలనా నిర్ణయాలు చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం జరగాలి. ప్రజాప్రతినిధుల అధికార పరిధి, అధికారుల బాధ్యతల మధ్య స్పష్టమైన గీత ఉండాలి.
అన్ని ప్రభుత్వ శాఖల్లో, స్థానిక సంస్థల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ కలెక్షన్ల దందాను అడ్డుకుంటే, ప్రభుత్వం సాధించే ఏ ఇతర అభివృద్ధి పథకం కంటే కూడా ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది. ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. ప్రతి ఫిర్యాదుకు స్పందన ఉండాలి. కానీ వ్యవస్థను బాగుచేసే దిశగా ఏ ఒక్కరూ అడుగులు వేయడం లేదు.
న్యాయం ఎలా..
ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కూడా నేడు పూర్తిగా విఫలమయ్యాయి. డిపార్ట్మెంట్ హెడ్ (హెచ్వోడీ)లపై ప్రజల్లో నమ్మకం పోతోంది. నిజాయితీగా, నిష్పక్షపాతంగా సేవలందించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి స్వతంత్రంగా, నిజాయితీగా పనిచేయలేకపోతున్నారు.
ప్రజలకు ఆఖరి ఆశగా నిలవాల్సిన న్యాయ వ్యవస్థ కూడా తీవ్ర జాప్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఒక చిన్న న్యాయం జరగడానికి దశాబ్దాల కాలం పడుతోంది. పైగా, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా చివరకు న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ కూడా లేని పరిస్థితి నెలకొంది. మరి ఇన్ని అన్యాయాల మధ్య, ఇన్ని వ్యవస్థల వైఫల్యాల మధ్య నలిగిపోతున్న సామాన్యుడు రక్షణ కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎవరికి మొరపెట్టుకోవాలి?
రాజకీయాలు అధికార పోరాటాలకే పరిమితమైతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ప్రజాసేవకు తిరిగి ప్రాధాన్యం లభించినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ధర్మం గెలవాలంటే నిజాయితీగల నాయకత్వం, నిష్పక్షపాతమైన అధికారులు, వేగవంతమైన న్యాయవ్యవస్థ, చైతన్యవంతమైన పౌరసమాజం అవసరం.
ఆ మార్పు కోసం నేటి యువత నడుం బిగించాలి. జెన్-జీ తరం నడుం బిగిస్తేనే.. ఈ దుర్మార్గ రాజకీయ యుద్ధానికి ముగింపు పడి, సామాన్యుడికి నిజమైన న్యాయం లభిస్తుంది. సామాన్యుడికి న్యాయం లభిస్తే.. వ్యవస్థ మారుతుంది.. వ్యవస్థ మారితేనే సమాజం మారుతుంది.. సమాజం మారితేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది.
గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి..
గతాన్ని ఒక్కసారి నెమరువేసుకుంటే.. పాత రోజుల్లో దొరలు, భూస్వాములు ప్రజలపై తీవ్రమైన దాష్టికాలకు దిగేవారు. అమాయక ప్రజలను చెట్లకు కట్టేసి కొడుతూ, వారి రక్తాన్ని పిండేసేవారు. ఆనాడు ఆ దౌర్జన్యాలను, అణచివేతను ఎదుర్కొనేందుకే సమాజంలో నుంచి నక్సలైట్ల ఉద్యమం పుట్టుకొచ్చింది.
విచారకరమైన విషయమేమిటంటే, ప్రజాస్వామ్య యుగంలోనూ నేడు దాదాపు అదే తరహా అన్యాయాలు, దౌర్జన్యాలు రూపం మార్చుకుని కొనసాగుతున్నాయి. అప్పట్లో దొరలు నేరుగా దాడి చేస్తే, నేటి రాజకీయ దొరలు వ్యవస్థల వెనుక దాక్కుని పేదల పొట్ట కొడుతున్నారు.