ఢిల్లీకి కదలనున్న విపక్షాల దండు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల కమిషన్ (Election Commission) తీరును నిరసిస్తూ ఇండియా కూటమి భారీ ఆందోళనకు సిద్ధమైంది. 'ఓట్ బచావ్.. దేశ్ బచావ్' నినాదంతో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో (Ramlila Maidan) భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సుమారు 10 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల నిర్వహణ విధానంపై ఇండియా కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. 2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషన్ చట్టాన్ని రద్దు చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతోంది. ఇప్పటికే జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేస్తోంది.
అంతేకాకుండా దేశంలో ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల (Ballot Papers) ద్వారా నిర్వహించాలని కూటమి నాయకులు కోరుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు కాపాడటమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
మొత్తంగా 'ఓట్ బచావ్.. దేశ్ బచావ్' నినాదంతో చేపట్టనున్న ఈ నిరసన ర్యాలీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇండియా కూటమి డిమాండ్లపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.