మరో కొండగట్టు.. మద్దిమడుగు!

01-11-2026 | 05:45am
  1. నల్లమల ఒడిలో కొలువుదీరిన పబ్బతి ఆంజనేయుడు
  2. 12 మందితో మొదలై లక్షలాది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రం
  3. నవంబర్ 11 నుంచి మండల దీక్షలకు సిద్ధం
  4. రూ.28 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు
  5. మరో రూ.200 కోట్లతో సంత్ సేవాలాల్ సాంస్కృతిక క్షేత్రం

ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు నల్లమల దట్టమైన అడవులు, కొండలు.. ఆ నడుమ హనుమాన్ నామస్మరణ.. కాషాయ వస్త్రాల్లో భక్తుల సందడి.. అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం. ప్రకృతి ఒడిలో భక్తి పరిమళాలు వెదజల్లుతున్న మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి క్షేత్రం(Maddimadugu Pabbati Anjaneya Swamy Temple) ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్నది. 1992లో మొదట డజన్ మందితో మొదలైన హనుమాన్ మాలధారణ సంప్రదాయం నేడు లక్షలాది మంది భక్తులతో అయ్యప్ప దీక్షలను తలపిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు.

కృష్ణాతీరంలో స్వయంభువు..

నాగర్‌కర్నూల్ జిల్లా, పదర మండలం, మద్దిమడుగు గ్రామంలో కృష్ణానది తీరాన పబ్బతి ఆంజనేయస్వామి కొలువుదీరారు. స్థానిక స్థలపురాణాల ప్రకారం స్వామివారు స్వయంభువుగా వెలిశారని ప్రచారంలో ఉంది. క్రీస్తుశకం 1120 ప్రాంతంలోనే స్వామివారి దర్శనం లభించిందని చెబుతుంటారు. 1992 నుంచి ఆలయంలో నిత్య పూజలు ప్రారంభమయ్యాయి. 1994లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. నల్లమల అటవీ అందాల మధ్య కొలువైన అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు వందల కిలోమీటర్లు పాదయాత్రగా తరలిరావడం ఈ క్షేత్రం ప్రత్యేకత.

మండల దీక్షలపై మహా నమ్మకం..

మద్దిమడుగు హనుమాన్ దీక్షకు ప్రత్యేక చరిత్ర ఉంది. 1992 కార్తీకమాసంలో పీఠాధిపతి జయరాం గురుస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి ఆధ్వర్యంలో కేవలం 12 మందితో మాలధారణ సంప్రదాయం ప్రారంభమైంది. నాలుగు రాష్ట్రాల భక్తులకు విస్తరించిన ఈ సంప్రదాయం నేడు క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టే భక్తులు కాషాయ వస్త్రధారణతో హనుమాన్ నామస్మరణలో గడుపుతారు.

ఈనెల 11 నుంచి 14 వరకు మాలధారణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ రాములు నాయక్, ఈవో రంగాచారి తెలిపారు. డిసెంబర్ 21 నుంచి 24 వరకు నాలుగు రోజులపాటు శివపార్వతుల కల్యాణం, సీతారాముల కల్యాణం, మహాపడిపూజ, కృష్ణానది పవిత్ర జలాలతో అభిషేకం, హనుమత్ గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఇరుముడులతో తరలివచ్చే స్వాముల మాల విరమణతో క్షేత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది.

కోట మైసమ్మకు కొలుపులు..

అంజన్న సన్నిధితో పాటు కోట మైసమ్మ అమ్మవారి ఆలయం కూడా మద్దిమడుగు క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కోటగోడ ప్రాంతానికి అనుబంధంగా అమ్మవారు కొలువై ఉన్నారని స్థానికుల విశ్వాసం. ముఖ్యంగా ఆదివారాల్లో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 

రూ.228 కోట్లతో అభివృద్ధి..

భక్తుల రద్దీ, క్షేత్ర ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఆలయ గాలిగోపురం, మాడవీధులు, సీసీ రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి రూ.28 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. 2014లో హైదరాబాద్ పరిసరాల్లోని తుర్కయంజాల్ ప్రాంతంలో భక్తులు మాలాధారణ కోసం ఆలయ పీఠాధిపతి జయరాం గురుస్వామి హనుమత్ దీక్ష గురు పీఠం ఏర్పాటు చేశారు.

2023 లో మద్దిమడుగు క్షేత్రంలోనే మరో దీక్ష గురి పీఠాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు సుమారు 20 ఎకరాల్లో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంత్ సేవాలాల్ మహారాజ్ క్షేత్రాన్ని నిర్మించేందుకు రూ.200 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం మద్దిమడుగు గ్రామకంఠం నుంచి 20 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మద్దిమడుగు ఆధ్యాత్మికతతో పాటు గిరిజన సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగానూ గుర్తింపు పొందనుంది.

కృష్ణమ్మపై వంతెన కడితే..!

మద్దిమడుగు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మాచారం వరకు కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభతరమవుతాయి. ముఖ్యంగా భక్తులకు ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ఈ క్షేత్రానికి మరింత ఆదరణ లభించనుంది. తాగునీరు, వసతి, స్నానపు గదులు, పార్కింగ్, వైద్య సదుపాయాలు మెరుగుపరిస్తే యాత్రికులకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే అభివృద్ధి పనులు నల్లమల పర్యావరణానికి, స్థానిక గిరిజనుల జీవన విధానానికి విఘాతం కలగకుండా చేపట్టాల్సిన అవసరం ఉంది.

బొడ్డుపల్లి మల్లయ్య, విజయక్రాంతి, నాగర్ కర్నూల్.

మరిన్ని వార్తలు