కాకతీయుల వాణిజ్య వైభవం

01-11-2026 | 05:50am

వస్తు ఉత్పత్తిని వినియోగదారులకు చేరవేసే వ్యాపార సంస్కృతి శతాబ్దాల కాలంనాటిదే. కాకతీయుల కాలం(Kakatiya Period)లోనూ ప్రాచీన వర్తక శ్రేణుల ద్వారానే వాణిజ్యం జోరుగా సాగేది. అప్పట్లో వ్యాపారాన్ని ‘వ్యవహారం’ అని, వ్యాపారులను ‘బేహారి’ పిలిచేవారు. ఆ రోజుల్లోనే వ్యాపార వ్యవస్థ స్వదేశీ, విదేశీ అని రెండు రకాలుగా వర్ధిల్లింది.

స్వదేశీ వర్తకులను ‘నకరం’ అని, విదేశీ వర్తకులను ‘నానాదేశి పెక్కండ్రు’ లేదా  ‘ఉభయ నానాదేశి పెక్కండ్రు’ అని పిలిచేవారు.బాదామీ చాళుక్యుల కాలంనాటి దక్షిణభారత ప్రసిద్ధిగాంచిన వ్యాపార సమాఖ్య ‘అయ్యా వళి-500 శ్రేణి’ కాకతీయులకాలంలో కూడా కొనసాగింది. అయితే ఈ శ్రేణి పూర్వంలా జైనమతానికి పరిమితం కాలేదు. వీరిలో వీరబలింజ, వీరబణంజలు వర్గాలు తక్కువగా కనిపించేవి. కాగా, వీరబణంజలు కోమట్లు కారని, వైశ్యులు, బలింజలు వేర్వేరు వర్గాలని ప్రతాపచరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

క్రీ.శ.1292నాటి త్రిపురాంతకశాసనం125 రెండవ భాగంలో ‘అయ్యావళి-500’ ప్రస్తావన వుంది.125 వ్యాపారుల శ్రేణిలో రెడ్లు, నాయుడులు, బోయలు, దాసర్లు కనిపించారు. వీరిని ‘నానాదేశి పెక్కండ్రు’ అని పేర్కొన్నారు. కట్కూరు శాసనం నకరము, కాంపులు, బలంజ సెట్టిలను వేరుగా ప్రస్తావించింది. క్రీ.శ.1269నాటి శాసనం యనమదల స్థలానికి చెందిన వీరబణంజ సమయం పాకనాడు, వేంగి, అనుమకొండ పట్టణ స్థలాల్లో వ్యాపార అనుమతి కలిగి ఉందని చెబతున్నది. క్రీ. శ.1228నాటి ఓరుగల్లు కోట శాసనం వస్త్ర వ్యాపారులు, నీలిమందు బేహారులు, నకరము వారినే కాక శాసిర్బరుసమయం(వేయి సమయం, బహుశః అయ్యావళి-500 వంటిది కావచ్చు) వారు తమలపాకులు, కాయగూరలు, కొబ్బరి, మామిడి, చింతపండు, ఇతరపండ్లు, పచ్చళ్ల వ్యాపారుల గురించి ప్రస్తావిస్తున్నది.

బాదామీ చాళుక్యుల కాలంలో ‘అయ్యావళి-500’ ప్రసిద్ధ వ్యాపార శ్రేణి దక్షిణ భారత దేశమంతటనే కాకుండా విదేశాల్లో కూడా వాణిజ్యం చేసేది. వారిపేరున నిర్మింపబడిన నగరమే ఐహోలు. అయ్యావళే అయ్యనవోలు, అయ్యవోలు క్రమంగా ఐహోలుగా పిలువబడుతోంది. అదే పేరుతో వరంగల్లు సమీపంలో ఐనవోలు, అయినవోలు, ఐలేనిగా పిలువబడే నగరం ఉంది. ఈ నగరం వరంగల్లు కన్నా ముందే నిర్మించ బడినది. వరంగల్లులో కన్నా ముందరనే ఇక్కడ నాలుగు వైపుల తోరణ ద్వారాలు నిలుపబడ్డాయి.

ఇక్కడ ప్రస్తుతం మైలారుదేవుని, మల్లన్నదేవుని గుడిగా పిలువబడుతున్న దేవాలయం ఉంది. ప్రధాన గర్భగుడిలో లింగం ప్రతిష్ఠించబడిన దేవతాధిష్ఠాన పీఠం సాధారణంగా శివలింగం ఉండే పానవట్టం కాదు. ఒక వైపునకే అభిషేక జలాలు పారే, ఏకవిగ్రహ ప్రతిష్ఠకు తగిన అధిష్ఠాన పీఠం అది. అయ్యావళి-500, వీరబణంజలు జైనమతానుయాయులు. కానీ, వారు వ్యాపారులు కనుక అన్నిమతాల దేవాలయాలకు దానాలిచ్చేవారు. నిర్మాణాలు చేయించేవారు. ఈ ఐ(న)వోలు ఒకప్పటి అయ్యావళి-500 కేంద్రమని చెప్పవచ్చు.వీరబణంజలు అయ్యావళి-500లో భాగమైనవారిగా జైనమతపర్యావరణంలో జైనమతవ్యాపారుల మద్ధతు పొందినవారు.

వీరబణంజలు చెప్పుకునే ‘బలదేవ, వాసుదేవ, ఖండళి, మూలభద్ర వంశోద్భవరుం’ జైన ఇతిహాసాల ప్రకారం 63మంది శలాకా పురుషుల్లో వున్నవారే. బలదేవ, వాసుదేవ, ఇంద్రభక్తుడైన మూలభద్రుని వంశవారసులమని భావిస్తారు.126 కాకతీయుల కాలంలో వీరు జైనమతానికి కట్టుబడి వుండకపోవచ్చు. రాజులమతం మారింది. రాజ్యమతంగా శైవం రూపుదిద్దుకుంటున్న కాలం. వృత్తికారులు, వివిధ వస్తు ఉత్పత్తిదారులు వారి ‘సమయాల’ను ఏర్పరచుకుని అడ్డాల్లో, సంతల్లో తమ ఉత్పత్తులను అమ్ముకునేవారు. అడ్డవట్టు సుంకం చెల్లించేవారు.

వర్తకులు : అప్పట్లో వర్తకమంతా వైశ్యుల ఆధీనంలోనే వుండేది. వీళ్లనే కోమట్లని కూడా పిలుస్తాం.(జైనమత గోమఠేశ్వరుని పేరు నుంచే కోమటి మాట పుట్టిందని ఒక అభిప్రాయం వుంది) కోమట్లను శెట్టి, సేట్లు అని కూడా అంటారు. ఇప్పటికీ గ్రామాల్లో ప్రజల అవసరాలకు అవసరమైన వస్తుసామగ్రిని తెచ్చి అమ్మేవారు వీరే.

వాణిజ్యానుమతి : ఒక అడ్డా, ఒక అంగడి, ఒక పట్టణంలో వ్యాపారం చేసుకోవడానికి ఆయా సమయాలు ఆ ప్రాంతప్రభువు అనుమతి పొందవలసి వుంటుంది. ప్రతాపరుద్రుని కాలం, చిత్తాపూర్ శాసనం అయ్యావళి-500కి చెందిన వీరబలింజ కులం బైరిసెట్టి పెదపరియాల గ్రామంలో చెరువు తవ్వించినట్లు చరిత్ర చెబుతుంది. చెరువు నీటితో పండించిన పంటలో మూడో వంతు దేవునికి, రెండో వంతు రాజుకు ఇచ్చినట్లు తెలియజేస్తున్నది.127 వ్యాపారుల మతసంబంధాన్ని తెలియజెప్పే శాసనం.. క్రీ.శ.1282నాటి త్రిపురాంతకంలోని శాసనంలో నానాదేశిపెక్కండ్రు అనే సమయం వ్యాపార అనుమతి గురించి చెబుతున్నది. అయ్యావళి-500తో మొదలై సభ్యులందరి పేర్లు పేర్కొనబడ్డాయి. వీరిలో రెడ్లు, నాయుడులు, శెట్టి ఇతర వర్గాల వారు కూడా ఉన్నారు.   

సంతలు, పెంటలు : పెంట, సంత, అడ్డల్లో  అన్నిరకాల గుత్త, చిల్లర వ్యాపారుల సాగేవి. పశువుల కోసం ప్రత్యేకంగా అంగడి, సంతలు ఉండేవి. ఇప్పటికీ పశువుల అంగడులు గ్రామ కేంద్రాల్లో కొన్నిచోట్ల సాగుతున్నాయి. ఇవిగాక వస్తువుల బేపారం చేసే అంగడి, సంతలు అప్పుట్లో ఉండేయి. ఇప్పుడు గ్రామాల్లో అంగడి పేరన వుంటున్నాయి.

వ్యాపార మార్గాలు ఇవీ..

సరుకుల రవాణాకు దీర్ఘరహదారులు ఉండేవి. రాయచూరు-  బీదరు కళ్యాణి- బాటలు అప్పట్లో అంతర్‌రాజ్య వాణిజ్య మార్గాలు. కోప్గల్- రహదారిని దండుబాట అని పిలిచేవారు.ఇదే సైనిక మార్గంగా కూడా ఉపయోగపడేది. బీదరు- వరంగల్లు బాట ప్రాచీనమైనవి. కాకతీయుల కాలంలో హన్మకొండ అన్ని ప్రధాన వాణిజ్య కేంద్రాలతో కలిపి ఉండేది. అటువంటి బాటలన్నీ ఇపుడు ప్రధాన జాతీయ రహదారులుగా, రాష్ట్ర రహదారులుగా మారిపోయాయి. ఓడ రేవులను కలుపుతూ ప్రధాన రహదారులకు తొవ్వలుండేవి. పెరిక బండ్లు, ఎద్దుల యజమానులైన కాపులను పెరికలని పిలిచేవారు. 

అప్పటి కొలతల పద్ధతి.. బండెడు, పెరికెడు

కాకతీయుల రాజధాని వరంగల్లు పెద్ద వాణిజ్య కేంద్రం. అంగడిని మఠియ అని పిలిచే వారని వరంగల్లు శాసనంలో ఉంది. సంత, అంగడి ఉన్న చోటుకు మఠియ అనేది పేరు. ఇప్పటికి వరంగల్లులో మట్టెవాడ పెద్ద అంగడే. అలాగే నల్లగొండ సమీపంలోని పానుగల్లు కూడా పెద్ద వ్యాపార కేంద్రం. ఇది కందూరు చోళుల రాజధాని.మహబూబునగర్ జిల్లా జడ్చర్ల, ఆలంపురం కూడా వాణిజ్య కేంద్రాలు విలసిల్లాయి. వీటితో పాటూ రాయచూరు -మగతల, మంథని, పేరూరు (నల్లగొండ) వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి.

మోటుపల్లి శాసనం ప్రధానమైన ఆధారం 

కాకతీయుల కాలంలో విదేశీ వ్యాపారం గురించి ప్రస్తావించడానికి మోటుపల్లి శాసనమే ప్రధానమైన ఆధారం. 128 మోటుపల్లి (దేశుయక్కొండ పట్టణం)లో గణపతి దేవుడు వేయించిన క్రీ.శ.1244నాటి మోటుపల్లి శాసనం వర్తకులకిచ్చిన రాయితీల నిచ్చినట్టు చెబుతోంది. కాకతీయ సంచిక(పే.53)లో మోటుపల్లికి వేలా నగరమనే పేరుందని, మోటుపల్లిరేవులో విదేశీ నావికులకు తీరమండలికుల నుంచి రక్షణకు సేనాని సిద్ధయదేవుని గణపతిదేవుడు నియమించాడని చెప్పబడ్డది. శ్రీగంధం, పచ్చకర్పూరం, ముత్యాలు, పగడాలు, దంతాలు, పట్టునూలు, మిరియాల వంటి సరుకులమీద నియమిత సుంకం ఏర్పరిచాడు. విదేశీవాణిజ్యం మీద పన్నులు తీయించాడని తెలుస్తున్నది.

‘ప్రాణంకంటె సంపదనే ఎక్కువగా భావించి తమ ప్రాణాలను పణంగా పెట్టి సముద్రయానం చేసే వర్తకులపై దయతో మా కీర్తి, ధర్మాల కోసం నిర్ణీతసుంకం తప్ప మొత్తాన్నీ ఇచ్చివేస్తున్నాం’ అనే గణపతిదేవుని ఆదేశాన్నీ మోటుపల్లిశాసనం వివరిస్తున్నది. మోటుపల్లి రేవును సందర్శించిన వెనీసు యాత్రికుడు మార్కోపోలో ‘ఈ రేవునుంచి ఎగుమతి అయ్యే వస్తువుల్లో వజ్రాలు, సాలెపురుగు జాలం వలె వుండే అతి విలువైన సన్నని వస్త్రాలు ముఖ్యమైనవి. వీటిని ధరించడానికి ఇష్టపడని రాజు, రాణికాని ప్రపంచంలో ఉండరని రాసుకున్నాడు. పన్నులు వసూలు చేసే రేవు పట్టణాలను ‘కరపట్టణాలు’ అని పిలిచేవారు. కృష్ణపట్నం, హంసలదీవి (దివి), బందరు రేవు పట్టణాలుగా ప్రసద్ధిగాంచాయని శాసనంలో ఉంది.

శ్రీరామోజు హరగోపాల్,

కన్వీనర్, కొత్త తెలంగాణ

చరిత్రబృందం

99494 98698

మరిన్ని వార్తలు