ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు
ఇజ్రాయెల్ ఎన్నికల్లో ట్విస్ట్.. మారనున్న ఇజ్రాయెల్ భవిష్యత్తు?
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు Exit Polls వెల్లడించాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని కూటమికి ప్రతిపక్ష కూటమి గట్టి పోటీ ఇచ్చినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అయితే ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదని వచ్చిన అంచనాలతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 7, 2023న జరిగిన హమాస్ దాడుల తర్వాత జరిగిన తొలి ఎన్నికగా ఈ పోరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దేశ భద్రత, యుద్ధ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. ప్రధాన ఇజ్రాయెల్ టెలివిజన్ నెట్‌వర్క్‌లు ప్రసారం చేసిన Exit Polls ప్రకారం, మాజీ సైనికాధికారి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 53 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ (Likud) పార్టీ, దాని మిత్రపక్షాలకు కలిపి 50 స్థానాలు రావచ్చని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ (Knesset)లో మొత్తం 120 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ లెక్కలతో ఏ పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే చర్చ మొదలైంది.
ప్రభుత్వ ఏర్పాటులో అరబ్ పార్టీలే కీలకం?
ఎన్నికల ఫలితాల్లో ఇజ్రాయెల్ అరబ్ పార్టీల పాత్ర కీలకంగా మారే అవకాశముంది. Exit Polls అంచనాల ప్రకారం, ఈ పార్టీలకు 17 నుంచి 18 స్థానాలు దక్కవచ్చని తెలుస్తోంది. దీంతో Coalition Government ఏర్పాటులో వాటి మద్దతు నిర్ణయాత్మకంగా మారవచ్చు. ఐసెన్‌కోట్ అరబ్ ఎంపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై గతంలో పరిమితులు వ్యక్తం చేసినప్పటికీ, పార్లమెంట్లో కొన్ని కీలక ఓట్లకు వారి మద్దతు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మరోవైపు, నెతన్యాహూ మిత్రపక్షమైన ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్.. ప్రతిపక్షం అప్పుడే విజయోత్సవాలు చేసుకోవడం తొందరపాటేనని వ్యాఖ్యానించారు.
నెతన్యాహూ రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వివిధ దశల్లో ప్రధానిగా కొనసాగిన నెతన్యాహూకు ఈ ఎన్నికలు కీలక పరీక్షగా మారాయి. గాజా యుద్ధం, ఇరాన్‌తో ఉద్రిక్తతలు, ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న ఒంటరితనం వంటి అంశాలు ప్రచారంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. నెతన్యాహూ ప్రభుత్వంపై బాధ్యత, భద్రత విషయంలో విమర్శలు వెల్లువెత్తగా, ఐసెన్‌కోట్ మార్పు తీసుకురాగల నాయకుడిగా తనను తాను ముందుకు తెచ్చుకున్నారు. అయితే ఐసెన్కోట్కు ప్రతిపక్షంలో ఆధిక్యం వచ్చినంత మాత్రాన ప్రధానమంత్రి పదవి ఖాయమని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 78 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిటీ గణాంకాలు వెల్లడించినట్లు సమాచారం. 2001 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్‌గా అంచనా వేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయి అధికారిక ఫలితాలు వెలువడిన తర్వాతే ఏ కూటమికి ఎన్ని స్థానాలు దక్కాయో స్పష్టత రానుంది. ఆ తర్వాత రాజకీయ పార్టీల మధ్య చర్చలు, మద్దతు సమీకరణాలు, కూటముల ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.