కార్మిక శాఖ బీమాలో అక్రమాలు
ట్రయల్ బ్లెజర్ సంస్థపై చర్యలు తీసుకోవాలి
ఐఆర్‌డీఏఐకి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ కార్మిక శాఖలో(Telangana Labour Department) బీమా చెల్లింపులకు(Insurance payments) సంబంధించి అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కు లేఖ రాశారు. ట్రయల్ బ్లెజర్ సంస్థకు(Trailblazer Organization) సంబంధించిన లావాదేవీలు, బీమా క్లెయిమ్‌ల చెల్లింపులు(Payment of insurance claims), రూ.346 కోట్ల నిధుల స్వీకరణ, నిర్వహణపై సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.
అక్రమాలు నిర్ధారణ అయితే ఈడీ, ఏసీబీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పట్టుపట్టారు. ట్రయల్ బ్లెజర్ సంస్థ రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, విచారణ పూర్తయ్యే వరకు ఆ సంస్థకు ఎలాంటి కమీషన్ లేదా పారితోషికం చెల్లించకుండా ప్రభుత్వం, సంక్షేమ బోర్డును ఆదేశించాలని కోరారు. జూన్ 2025 నుంచి ఇప్పటివరకు చెల్లించిన ప్రతి బీమా క్లెయిమ్‌ను ఆడిట్ చేయాలని సూచించారు. ముఖ్యంగా పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో చెల్లించిన క్లెయిమ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రయల్ బ్లెజర్ సంస్థ నియామక ప్రక్రియ, మూలధనం, అర్హతలు, కార్యాలయాల మార్పులు, రూ.346 కోట్ల నిధుల స్వీకరణ, నిర్వహణ, క్లెయిమ్‌ల చెల్లింపుల్లో సంస్థ పోషించిన పాత్ర, అందుకున్న పారితోషికం తదితర అంశాలపై ఇన్సూరెన్స్ చట్టం-1938లోని సెక్షన్ 33 ప్రకారం తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ, సంక్షేమ బోర్డుల తరఫున నిర్వహించిన బాధ్యతలను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. అలాగే ట్రయల్ బ్లెజర్, క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధించిన బోర్డు పాలసీల రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు.
అవసరమైన అన్ని పత్రాలను సంబంధిత అధికార సంస్థ ముందు సమర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీమా ప్రీమియం గణన విధానం, ప్రతి పాలసీ సంవత్సరానికి సంబంధించిన క్లెయిమ్‌ల పూర్తి వివరాలను వెల్లడించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనతో పాటు ఇతర గ్రూప్ బీమా పథకాల ప్రీమియంలతో పోల్చి, ధరలపై ఫోరెన్సిక్ ఆడిట్, యాక్చువేరియల్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీమా క్లెయిమ్‌లలో మోసాలు జరిగినట్లు తేలితే, వాటి కారణంగా నష్టపోయిన అసలైన నామినీలకు న్యాయం జరిగేలా నిర్ణీత గడువులో చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా పోలీసు కేసులు నమోదు చేసి, అవసరమైతే సీబీఐ, ఈడీ, ఏసీబీ దర్యాప్తునకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఐఆర్‌డీఏఐని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కోరారు.