గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణకు మరింత ప్రతిష్ఠ
ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు
29న ఢిల్లీలో ప్రోగ్రాంను విజయవంతం చేయాలి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): డిసెంబర్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌తో(Invest Telangana Global Summit) రాష్ట్ర ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై మంగళవారం సీఎం సమీక్షించారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ(Future City)లో డిసెంబర్ 7 నుండి నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్(Global Summit Program), ఔత్సాహిక పెట్టుబడిదారులు(Investors), వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్ ఈవెంట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నవంబర్ మొదటి వారంలోగా ప్రణాళికలను ఖరారు చేసుకుని పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన వివిధ ప్రముఖులను.. అతిథులకు చాటిచెప్పేలా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రచార ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం చేపట్టాలని సీఎం సూచించారు.
క్లైమేట్ చేంజ్, ఏఐ రంగాలకు సంబంధించిన ప్రపంచ స్థాయి ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించాలన్నారు. ఏవిజిసి (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులు సీఎంకు వివరించారు. తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు.
బతుకమ్మ పండుగ గురించి అతిథులు తెలుసుకునేలా ప్రత్యకంగా డిజైన్లు, ఏర్పాట్లపై అధికారులు వివరించారు. సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డి. అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.