ఎటుచూసినా కల్తీ ప్రాణాలపై కత్తి!

28-10-2026 | 05:45am

రాష్ట్రంలో టన్నుల కొద్దీ కల్తీ సరుకుల పట్టివేత.. 

వందల కేసులు.. అయినా ఆగని అక్రమ దందాలు

జరిమానాలతో సరిపెడుతున్న వైనం.. కల్తీకి పాల్పడేవారిపై కఠినమైన క్రిమినల్ చర్యలేవీ?

* ఉదయం లేవగానే టీ తాగుదామంటే పాలు కల్తీ.. టీ పొడి కల్తీ.. వంట చేసుకుందామంటే ఆహార పదార్థాలన్నీ కల్తీ.. మంచినీరు బాటిల్ కొన్నా కల్తీ.. పండుగలకు మిఠాయిలు కొన్నా కల్తీనే.. అసలు కల్తీ లేనిది ఎక్కడ అంటూ తరచి చూస్తే.. కల్తీ లేని పదార్థం, వస్తువులు కనపడటం లేదు. ఇదీ ప్రస్తుత పరిస్థితి. ప్రజలకు మంచి ఆహార పదార్థాలు అందించాల్సిన వ్యాపార వ్యవస్థలో అక్రమార్కులు విష సంస్కృతికి తెరతీస్తున్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహార పదార్థాలనే అక్రమ సంపాదనకు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. పాలు, నెయ్యి, పన్నీర్, టీ పొడి, మసాలా దినుసులు, అల్లంవెల్లుల్లి పేస్ట్, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు.. ఇలా నిత్యం వినియోగించే అనేక పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో కల్తీ వ్యవహారాలు వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

అక్టోబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల(Rachakonda Police Commissionerate) పరిధిలో ప్రభుత్వ నిఘా బృందాలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force police), ఆహార భద్రతా అధికారులు(Food Safety Officials) చేపడుతున్న దాడుల్లో భారీ మొత్తంలో కల్తీ ఆహార పదార్థాలు(Adulterated food items) పట్టుబడుతున్నాయి. అక్రమ తయారీ కేంద్రాలు బయటపడుతున్నాయి. కేసులు నమోదవుతున్నాయి. నిందితులు అరెస్టవుతున్నారు. అయినా ఈ దందా పూర్తిగా అదుపులోకి రాకపోవడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

హైదరాబాద్‌లో ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందమైన హెచ్-ఫాస్ట్ ఏర్పాటుతో(Setting up H-Fast) తనిఖీలు మరింత ముమ్మరమయ్యాయి. ఈ బృందం ఏర్పాటైన తొలి 100 రోజుల్లోనే.. 185 కేసులు నమోదు చేసి, దాదాపు 122 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. మరో 247 కేసులను నియంత్రణ చర్యల కోసం జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా అధికారులకు పంపినట్లు పోలీసులు వెల్లడించడం.. ఈ కల్తీ దందా ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థమవుతోంది.

హెచ్‌ఫాస్ట్ బృందాల దాడుల్లో 27 టన్నులకు పైగా అల్లంవెల్లుల్లి పేస్ట్, 25 టన్నులకు పైగా రసాయనాలతో పండించిన పండ్లు, సుమారు 9.26 టన్నుల నాసిరకం, కల్తీ పచ్చళ్లు, దాదాపు 4 టన్నుల కల్తీ కోవా, టీ పొడి, క్రీమ్, పన్నీర్, నెయ్యి తదితర పదార్థాలు పట్టుబడ్డాయి. మరికొన్ని ఆహార పదార్థాలు ప్రయోగశాలల్లో పరీక్షించి, విచారణలు జరపాల్సి ఉంది. అయినప్పటికీ పట్టుబడుతున్న పరిమాణం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. 2026 మార్చిలో కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో దాడిచేస్తే.. కండ్లు తిరిగే స్థాయిలో నిజాలు బయటపడ్డాయి.

నాసిరకం ముడి పదార్థాలు, అపరిశుభ్రంగా తయారీ విధానాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు సుమారు 4,032 కిలోల పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో 6,200 కిలోలకు పైగా నాసిరకం ముడి పదార్థాలు, ఇతర వస్తువులు కూడా పట్టుబడ్డాయి. అంతకుముందు లాలాపేటలో నిర్వహించిన మరో దాడిలో సుమారు 1,915 కిలోల అల్లంవెల్లుల్లి పేస్ట్‌తోపాటు ఎసిటిక్ యాసిడ్, ఇతర రసాయన పదార్థాలు, ప్యాకింగ్ సామగ్రి, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బ్రాండ్ల లేబుళ్లతో ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై నలుగురిని అరెస్టు చేశారు.

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. నిజానికి ఇక్కడ ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే.. ఒకటి రెండు కిలోల సరుకుతో పట్టుబడిన చిన్న వ్యాపారం కాదు ఇది. వేల కిలోల ఉత్పత్తులను తయారుచేసి హోల్‌సేల్ దుకాణాలు, హోటళ్లు, క్యాటరింగ్ సంస్థలకు సరఫరాచేసే స్థాయిలో వ్యవస్థీకృత దందాలు నడుస్తున్నాయనేది గ్రహించాలి.

మసాలా దినుసుల్లో పారిశ్రామిక రంగులు!

ఈ యేడు ఆగస్టులో హైదరాబాద్‌లో హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 25 టన్నులకు పైగా కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. జీలకర్ర, వాము, లవంగాలు, ఆవాలు, సోంపు తదితర దినుసులకు సంబంధించిన నిల్వలు పట్టుబడ్డాయి. కొన్ని కేంద్రాల్లో మసాలా దినుసుల రంగు, మెరుపు, బరువు పెంచేందుకు పారిశ్రామిక రంగులు, అనారోగ్యాన్ని కలిగించే.. తినడానికి అనువుకాని పదార్థాలు కలిపినట్లు అధికారులు చెబుతున్నారు. మసాలా దినుసులు అనేవి దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో ఉపయోగించే పదార్థాలు. వాటిలో పారిశ్రామిక రంగులు, ఇతర ప్రమాదకర పదార్థాలు కలిపితే, వాటిని వినియోగించే కుటుంబాలన్నీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి కేసులను సాధారణ వ్యాపార ఉల్లంఘనలుగా చూడటం తగదు.

టీ పొడి నుంచి నెయ్యి వరకు..

2026 ఏప్రిల్‌లో నగరంలోని 15 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో సుమారు 4.5 టన్నుల కల్తీ, గడువు ముగిసిన టీ పొడి, రంగులు, ఇతర పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పది మందిని అరెస్టు చేశారు. టీ పొడిని ఇతర పదార్థాలతో కలిపి, కృత్రిమ రంగులతో రూపాన్ని మార్చి, వేర్వేరు బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు, 2026 జూలైలో హైదరాబాద్‌లోని 14 సంస్థలపై ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టి, వినియోగానికి పనికిరాదని తేలిన 60 కిలోల నెయ్యిని ధ్వంసం చేశారు. కల్తీ అనుమానంతో మరో 850 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకుని ప్రయోగశాలకు పంపించారు. ఈ ఉదాహరణలు కల్తీ సమస్య ఒక పదార్థానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని స్పష్టం చేస్తున్నాయి.

2025 జూలైలో రాచకొండ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 46 కేసులు నమోదు చేసి 52 మందిని అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 575 లీటర్ల కల్తీ నెయ్యి, 7,000 కిలోల అల్లంవెల్లుల్లి పేస్ట్, 35 కిలోల కల్తీ పన్నీర్ తదితర పదార్థాలు పట్టుబడ్డాయి. పాల ఉత్పత్తులు, పసుపు, ధనియాల పొడి, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తులు, స్వీట్లు, ఐస్‌క్రీంలకు సంబంధించిన కల్తీలుకూడా వెలుగుచూశాయి. అనుమతులు లేకుండా తయారీ, గడువు తేదీల వివరాలు లేకపోవడం, నిషేధిత సింథటిక్ రంగుల వినియోగం, ప్రసిద్ధ బ్రాండ్ల పేర్లతో నకిలీ లేబుళ్లు పెట్టడం వంటి అంశాలను పోలీసులు గుర్తించారు.

ప్రజల ప్రాణాలు లాభనష్టాల లెక్కలో భాగం కావు..

ఒక వ్యక్తి ఆహార పదార్థంలో కల్తీ చేసి సంపాదించే అక్రమ లాభం కొద్దిమందికే ప్రయోజనం కలిగించవచ్చు. కానీ ఆ పదార్థాన్ని వినియోగించే వందలాది కుటుంబాల ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చు. కల్తీ వల్ల అనారోగ్యం వస్తే బాధిత కుటుంబాలు వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తితే దాని ప్రభావం వ్యక్తితోపాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిపైనా పడుతుంది. అందువల్ల ఆహార కల్తీని కేవలం వినియోగదారుల మోసంగా చూడటం సరిపోదు. అది ప్రజారోగ్యం, ఆర్థిక న్యాయం, ప్రభుత్వ బాధ్యత, చట్ట అమలుకు సంబంధించిన అంశం.

తెలంగాణలో ప్రభుత్వం, పోలీసులు, ఆహార భద్రతా విభాగాలు చేపడుతున్న దాడులు కొనసాగాలి. వాటితోపాటు కల్తీ వ్యాపారానికి ఆర్థికంగా లాభం లేకుండా చేయాలి. నేరం నిర్ధారణైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడం ప్రభుత్వానికి ఉన్న ప్రాథమిక బాధ్యతగా నిలవాలి. కల్తీ చేసి కోట్లు సంపాదించవచ్చు.. జరిమానా చెల్లించి బయటపడవచ్చనే భావనకు చట్టం అడ్డుకట్ట వేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారికి శిక్ష తప్పదనే నమ్మకం ప్రజల్లో కలగాలి. ఆహార కల్తీని అరికట్టే పోరాటం దాడులతో మొదలై, నేర నిర్ధారణతో శిక్షల వరకు చేరినప్పుడే నిజమైన ఫలితం కనిపిస్తుంది.

కఠిన శిక్షలతోనే భయం.. 

కల్తీ దందాను అరికట్టాలంటే ప్రభుత్వం కొన్ని కీలక చర్యలను అత్యవసరంగా చేపట్టాలి. 

క్రిమినల్ ప్రాసిక్యూషన్ : ప్రజల ఆరోగ్యానికి తీవ్రంగా ముప్పు కలిగించే ఉద్దేశపూర్వక కల్తీ, పునరావృత నేరాలపై చట్టప్రకారం జైలు శిక్ష సహా కఠిన శిక్షలు అమలయ్యేలా చూడాలి.

లైసెన్సుల రద్దు, యూనిట్ల మూసివేత : నేరం నిర్ధారణ అయిన సంస్థలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుని, అక్రమ తయారీ కేంద్రాలు మళ్లీ ప్రారంభం కాకుండా పర్యవేక్షించాలి.

సరఫరా గొలుసుపై దర్యాప్తు : తయారీదారుడితో పాటు ముడి పదార్థాల సరఫరాదారులు, నిల్వదారులు, పంపిణీదారులు, నకిలీ లేబుళ్లను తయారు చేసే వ్యవస్థలపైనా నిఘా పెంచి.. ఎక్కడికక్కడ అడ్డుకోవాలి.

వేగంగా కేసుల పరిష్కారం : ప్రయోగశాల పరీక్షలను త్వరగా పూర్తి చేసి, ఆధారాలను పకడ్బందీగా సేకరించి, కేసుల విచారణలో అనవసర జాప్యాన్ని తగ్గించాలి.

నేరస్తులపై ప్రత్యేక నిఘా : గతంలో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల వివరాలను సంబంధిత విభాగాలు సమన్వయంతో పర్యవేక్షించాలి. అలాగే మళ్ళీ.. మళ్ళీ చేసే నేరస్తులపై నిఘా పెంచి.. వారి కల్తీ దందా చేయకుండా శిక్షలు పడేలా చూడాలి.

జరిమానాతో సరిపోతుందా? 

ఇక్కడే అత్యంత కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. తనిఖీలు, స్వాధీనాలు, అరెస్టులు జరుగుతున్నా కల్తీ వ్యాపారాలు ఎందుకు మళ్లీ మళ్లీ వెలుగుచూస్తున్నాయి? అక్రమంగా సంపాదించే లాభాలతో పోలిస్తే శిక్షల తీవ్రత తక్కువగా ఉంటోందా? కేసులు విచారణలో జాప్యానికి గురవుతున్నాయా? లైసెన్సుల రద్దు, తయారీ కేంద్రాల మూసివేత, సరఫరా వ్యవస్థపై నిఘా వంటి చర్యలు తగిన స్థాయిలో అమలవుతున్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రతి కేసు జరిమానాతోనే ముగుస్తోందని చెప్పడానికి ఆధారాలు అవసరం. అయితే ఒకవేళ ప్రమాదకరమైన కల్తీకి పాల్పడిన వారిపై కేవలం జరిమానా విధించి వదిలేస్తే, వారు అక్రమంగా సంపాదించిన లాభాలతో పోల్చుకుని ఆ జరిమానాను వ్యాపారంలో ఒక ఖర్చుగా భావించే ప్రమాదం ఉంది. అప్పుడు చట్టం పట్ల భయం తగ్గి, అదే దందాను మళ్లీ ప్రారంభించే అవకాశం పెరుగుతుంది.

నిజానికి అదే జరుగుతోంది కూడా. అందుకే కల్తీని సాధారణ వాణిజ్య తప్పిదంగా కాకుండా, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, ఆహార భద్రతకు సంబంధించిన తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ఉద్దేశపూర్వకంగా ప్రమాదకర పదార్థాలు కలపడం, నకిలీ బ్రాండ్లతో ప్రజలను మోసం చేయడం, పదేపదే నేరాలకు పాల్పడడం వంటి సందర్భాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

కఠిన చట్టం దిశగా ప్రభుత్వం

ఆహార, ఔషధ కల్తీని అరికట్టేందుకు కఠిన చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 2026 జూలై 18న అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు తదితర పదార్థాల్లో చేసే కల్తీ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల్లో అమలవుతున్న కఠిన చట్టాలను అధ్యయనం చేయడం, కఠినమైన శిక్షలతో కూడిన చట్టాన్ని రూపొందించడం, కల్తీపై సమాచారం అందించే వ్యవస్థ ఏర్పాటు, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు వంటి అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

ఇది కల్తీ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించిన సంకేతం. అయితే చట్టం రూపకల్పనతోనే పని పూర్తికాదు. ప్రతిపాదిత చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఉద్దేశపూర్వక కల్తీకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? పదేపదే నేరాలకు పాల్పడేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఏ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు? వంటి అంశాలపై స్పష్టత రావాలి.

మరిన్ని వార్తలు