కర్ణాటక సీఎం డీకే ఓకే
జూరాలకు నారాయణపూర్ జలాలు
- విడతల వారీగా 3 టీఎంసీల విడుదలకు అంగీకారం
- డీకే శివకుమార్‌తో మంత్రులు జూపల్లి, వాకిటి భేటీ
- కన్నడ సర్కారుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): జూరాల ప్రాజెక్టు(Jurala Project)కు నీటి విడుదల(Water release) విషయంలో కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) సానుకూలంగా స్పందించింది. కర్ణాటకలోనూ నీటి పరిస్థితి అంతగా అనుకూ లంగా లేకపోయినప్పటికీ మన రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదలకు ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) సుముఖత వ్యక్తం చేశారు. బుధవా రం బెంగళూరులో ముఖ్యమంత్రి డీకేతో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు జీ మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి భేటీ అయ్యారు.
మన రాష్ట్ర సాగునీటి పరిస్థితులను డీకేకు వివరించారు. ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, జూరాల ప్రాజెక్టు నీటి మట్టం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆయకట్టు రైతుల ఇబ్బందులను వివరించారు. నారాయణపూర్ నుంచి జూరాలకు నీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జూరాల ఆయకట్టు పరిధిలోని పంటలు కీలక దశలో ఉన్నాయని, అందుకు 5 టీఎంసీల వరకు నీరు అవసరం ఉంటుందని డీకే దృష్టికి తీసుకెళ్లారు. అయితే కర్ణాటక ప్రభుత్వం 3 టీఎంసీల వరకు విడతల వారీగా ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
10 రోజుల పాటు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల కొనసాగిస్తూ జూరాలకు నీటిని అందిస్తామని సీఎం డీకే హామీ ఇచ్చినట్లు మంత్రులు జూపల్లి, వాకిటి తెలిపారు. తెలంగాణ రైతుల పరిస్థితిని సీఎం సానుకూలంగా అర్థం చేసుకుని, వెంటనే కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి ఎన్. చలువరాయస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. షాలినిరాజనీష్‌తో మాట్లాడారని చెప్పారు. జూరాలకు నీటి విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 20న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక సీఎం డీకేకు లేఖ రాశారని మంత్రులు జూపల్లి, వాకిటి తెలిపారు. అనంతరం ఆ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపుల వల్ల జూరాలకు నీటి విడుదల కు మార్గం సుగమమైందన్నారు. జూరాలతో పాటు భీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
నేడు ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు, అధికారులతో సమావేశం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సాగునీటి శాఖ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రులు వెల్లడించారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై చర్చిస్తామని తెలిపారు.
డీకేకు రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు..
నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాల విడుదలకు సానుకూలంగా స్పందించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన విజ్ఞప్తిని అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య స్నేహభావానికి గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న సోదర భావానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావాన్ని చాటాలే కృష్ణా జలాల విడుదల నిర్ణయం తీసుకున్నారంటూ డీకేపై ఎక్స్ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు.
జూరాల నుంచి సాగునీటి విడుదల
ఆత్మకూరు : జూరాల ఆయకట్టు రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాన ఎడమ కాలువ ద్వారా అధికారులు 900 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు సమాచారం. కొద్ది రోజులుగా సాగునీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు జూరాల వద్ద నిరసనలు చేపట్టారు. పంటలు ఎండిపోకుండా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాజా నీటి విడుదలతో రైతులకు కొంత ఊరట లభించింది. పంటల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.