నిఠారీ కేసు.. సురేంద్ర కోలి ఆత్మహత్య?

19-09-2026 | 05:05am
  1.   19 ఏళ్ల జైలు జీవితం.. చివరికి నిర్దోషిగా విడుదల
  2. సంచలనం సృష్టించిన 16 మంది చిన్నారుల మృతికేసు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: నోయిడా(Noida) 2006లో 16 మంది చిన్నారుల మృతి.. నిఠారీ వరుస హత్యల కేసు(Murder case)లో నిర్దోషిగా తేలిన సురేంద్ర కోలి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని ఆత్మహత్య(Suicide)పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కోత్వాలి నగర(City Kotwali) పరిధిలోని సప్తసరోవర్ రోడ్డులో ఓ టీస్టాల్ వద్ద వ్యక్తి మృతదేహం లభ్యమైందని సప్తరిషి పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతను టీస్టాల్ నిర్వహిస్తున్నాడని, అతనే సురేంద్ర కోలిగా గుర్తించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. 2005-06 నోయిడాలోని నిఠారీ ప్రాంతం నుంచి మహిళలు, పిల్లలు అదృశ్యమయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వ్యాపారవేత్త మొనిందర్ సింగ్ పండేర్ ఇంటివెనుక భాగం మురుగు కాలువలో మానవ అవశేషాలను గుర్తించారు. వీరిపై లైంగికదాడి జరిగిందని, హత్య చేసినట్లు గుర్తించారు. పండేర్ సహాయకుడు సురేంద్ర కోలి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

2007లో సీబీఐ కేసు దర్యాప్తు(CBI case investigation) చేపట్టింది. 19 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయగా, వాటిలో సీబీఐ 16 కేసులలో చార్జీషీట్లు దాఖలు చేసింది. మూడు కేసుల్లో సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టివేయగా, 13 కేసుల్లో కోలికి మరణశిక్ష ఖరారైంది. 2023లో అలహాబాద్ హైకోర్టు 12 కేసులలో కోలిని, పండేర్‌లను నిర్దోషులుగా తీర్పు చెప్పింది. 2025 నవంబర్‌లో సుప్రీంకోర్టు చివరి కేసులో కూడా కోలిని నిర్దోషిగా ప్రకటించింది. 19 ఏళ్లుగా జైలు జీవితం గడిపిన సురేంద్ర కోలి కొద్దికాలం క్రితం హరిద్వార్‌కు వచ్చి లాల్ చౌక్ ప్రాంతంలో చిన్న టీ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అదే షాపులో ఫ్యాన్‌కు వేలాడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరిన్ని వార్తలు