అర్థశాస్త్రంలో ఇద్దరికి నోబెల్

13-10-2026 | 05:05am
  1. రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్‌ను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం 
  2. స్థూల ఆర్థిక స్థిరీకరణ, సూక్ష్మ ఆర్థిక పునాదులపై విశేష కృషి
  3. ఇద్దరూ అమెరికాలో జన్మించిన ఆర్థికవేత్తలే
  4. విజేతలను ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్

స్టాక్హోమ్, అక్టోబర్ 12: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలు(Prominent economists) రాబర్ట్ ఈ హాల్(Robert E. Hall), మైఖేల్ వుడ్‌ఫోర్డ్‌లకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ప్రభుత్వాలతోపాటు కేంద్ర బ్యాంకులు ఆర్థిక ఒడిదుడుకులను, సంక్షోభాలను నిర్వహించడంలో సహాయపడిన నమూనాలపై చేసిన విశేషకృషికి గాను వారికి ప్రతిష్టాత్మక స్మారక పురస్కారం లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం స్టాక్‌హోమ్‌లో ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించింది. ‘స్థూల ఆర్థిక స్థిరీకరణ, సూక్ష్మ ఆర్థిక పునాదుల కోసం ఈ విజేతలను సత్కరిస్తున్నట్లు పేర్కొంది.

‘ఈ బహుమతి గ్రహీతలు ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గులను సమతుల్యం చేయడంలో మాకు సహాయపడ్డారని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. హాల్ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి, వుడ్‌ఫోర్డ్ న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయా నికి అనుబంధంగా ఉన్నారు. వుడ్‌ఫోర్డ్ సోమవారం న్యూయార్క్ నుంచి ఫోన్‌లో కమిటీతో మాట్లాడుతూ, ‘ఇది ఒక గొప్ప గౌరవం, ఇది ఒక ఆశ్చర్యం’ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఇప్పుడు ఉపయోగిస్తున్న నమూనాలకు, ఈ పురస్కార గ్రహీతల కృషి మనకు ఒక స్థిరమైన సైద్ధాంతిక పునాదిని అందించింది అని ఆర్థిక శాస్త్రాల బహుమతి కమిటీ చైర్మన్ జాన్ హాస్లర్ ఒక ప్రకటనలో తెలిపారు.

వారి సహాయంతో, ఇంధన సంక్షోభాలు లేదా గృహాలు వినియోగించే పరిమాణంలో ఆకస్మిక మార్పులు వంటి ఆర్థిక వ్యవస్థలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి మనం మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యాం అని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక శాస్త్ర బహుమతిని అధికారికంగా ‘బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కింద వీరికి 12 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (సుమారు 1.2 మిలియన్ యూఎస్ డాలర్లు లేదా దాదాపు రూ.11 కోట్ల 50 లక్షలు) ప్రైజ్ మనీగా లభిస్తుంది.

ఈ బహుమతి మొత్తాన్ని వీరిద్దరికీ సమానంగా పంపిణీ చేస్తారు. గత సంవత్సరం, వ్యాపార ఆవిష్కరణలను అధ్యయనం చేసే ముగ్గురు పరిశోధకులు, పాత కంపెనీలను వెనక్కి నెట్టివేస్తూనే, కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధిని, మానవ సంక్షేమాన్ని ఎలా ప్రోత్సహిస్తాయో వివరించినందుకు ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు.

డైనమైట్‌ను కనుగొని, ఐదు నోబెల్ బహుమతులను స్థాపించిన 19వ శతాబ్దపు స్వీడన్ వ్యాపారవేత్త, రసాయన శాస్త్రవేత్త అయిన నోబెల్ జ్ఞాపకార్థం, కేంద్ర బ్యాంకు ఈ ఆర్థిక శాస్త్ర బహుమతిని 1968లో స్థాపించింది. ఆర్థిక శాస్త్రంలో ఇచ్చే బహుమతిని సాంకేతికంగా నోబెల్ కాదని అంటుంటారు. కానీ 1896లో నోబెల్ మరణించిన వార్షికోత్సవమైన డిసెంబర్ 10న దీనిని కూడా మిగతా బహుమతులతో పాటే ప్రదానం చేశారు. గత వారం వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాలలో నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. 

మరిన్ని వార్తలు