అసెంబ్లీ తర్వాత రణరంగమే
- లక్షలాది మందితో కేసీఆర్ ప్రత్యక్ష ఉద్యమం
- నదీ జలాల ఎత్తిపోతలపై మహా పోరాటం
- రేవంత్ బజారు భాష వినడానికి కేసీఆర్ రావాలా?
- రేవంత్‌రెడ్డికి మానసిక స్థితి బాగాలేకే కేసీఆర్‌పై విమర్శలు
- ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబులాగా సీఎం అయ్యాకే అసెంబ్లీకి కేసీఆర్
- ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డే రాజీనామా చేయాలి
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శాసనసభను స్తంభింపజేస్తాం
- దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నడపాలి
- ప్రతిపక్షానికి సమయమివ్వకుంటే స్పీకర్‌పై అవిశ్వాసం
- బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశాల అనంతరం కేసీఆర్ రణరంగంలోకి వస్తారని, లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతారని మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహమే జరిగిందని, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, దళిత, గిరిజన, బీసీ వర్గాలను ఈ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలను, పార్టీ భవిష్యత్ కార్యాచరణను మీడియాకు వివరించారు.
ప్రజా సమస్యల మీద సమగ్రంగా చర్చించడానికి కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీ నడపాలని బీఏసీ సమావేశంలో డిమాండ్ చేస్తామని తెలిపారు. కాళేశ్వరం వద్ద నీళ్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులను ఏడిపిస్తోందని విమర్శించారు. కేసీఆర్ 80 శాతం పూర్తి చేసిన పాలమూరు ప్రాజెక్టులో చిన్న పని పూర్తి చేస్తే 60 టీఎంసీల నీళ్లు వచ్చే వీలున్నా ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో కేసీఆర్ స్వయంగా లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని వెల్లడించారు. 22ఏ కింద వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న తీరుపై, కరెంట్ కోతలు, రుణమాఫీ వైఫల్యం, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు,
సింగరేణి కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్‌ఎస్ ఫెయిల్యూర్ వంటి అన్ని అంశాలపైనా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం సభను స్తంభింపజేసి అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం కొట్లాడుతామని హెచ్చరించారు.
కేసీఆర్ గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి లేదు..
పాలన చేతకాక, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్‌లో రేవంత్ రెడ్డి కేసీఆర్ రాజీనామా అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని, దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు ముందు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డేనని అన్నారు.
అసలు కేసీఆర్ గురించి మాట్లాడే నైతికత రేవంత్‌కు లేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రజల గుండెల్లో నిలిచిన మానవీయ నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వాడుతున్న భాష బజారు భాషను తలపిస్తోందని, బడ్వె, పైల్వాన్..
బట్టలిప్పి కొడతాడు, తిరగేసి కొడతాడు అని అసెంబ్లీలో మాట్లాడటం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని, అలాంటి గౌరవం లేని సభకు కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం అందరం ఏకగ్రీవంగా నిర్ణయించామని వెల్లడించారు. కేసీఆర్ సైనికులుగా మేమడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సరైన సమయం ఇవ్వకుంటే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నాయకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ భద్రత మీద రేవంత్ రెడ్డికి ఏడుపెందుకని ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని నీ తమ్ముడికి నలుగురు గన్‌మెన్లకు రూ.౪౦కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావో చెప్పాలని నిలదీశారు. చరిత్రలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి నేతల పట్ల అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినప్పుడు.. వాళ్లు సభను బహిష్కరించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ ముఖ్యమంత్రులుగా సభలోకి అడుగుపెట్టిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.
కేసీఆర్ పట్ల కూడా కాంగ్రెస్ అలాగే ప్రవర్తిస్తోందని, అందుకే ప్రజల నుంచే బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. పొద్దున లేస్తే రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ చావును కోరుకునే రేవంత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదని మండిపడ్డారు.
ఇందిరా పార్క్ దగ్గర రోజూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వీఆర్‌ఏలు, ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారని, వాళ్లకు సమాధానం చెప్పే దమ్ములేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.






