సాయం 5 లక్షలు.. ఖర్చు 11 లక్షలు!
- ఇందిరమ్మ ఇంటితో పేదలపై ఆర్థిక భారం
- పేరుకే ప్రోత్సాహకం.. అదనంగా రూ.6లక్షల వరకు వ్యయం
బండి సంపత్‌కుమార్
మహబూబాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం (Construction Indiramma House)మొదలుపెట్టిన నిరుపేదలకు ఇప్పుడు ఖర్చుల భారం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వం అందించే రూ.5లక్షల సాయం ప్రోత్సాహకంగానే మిగిలిపోతోందని, ఇల్లు పూర్తి కావాలంటే అదనంగా మరో రూ.6లక్షల వరకు సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు.
నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల రేట్లు భారీగా పెరిగినందున ప్రభుత్వం సాయం అందించినా ఇంటి నిర్మానం ఆర్థిక భారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ దశలను బట్టి విడతల వారీగా రూ.5లక్షలు విడుదల చేయాలని గృహ నిర్మాణ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 400 అడుగుల స్థలంలో, రూ.5 లక్షల్లోనే ఇల్లు పూర్తి చేయాలని నిర్దేశించింది. కొద్దిపాటి స్థలంలోనే డబుల్ బెడ్ రూమ్, అటాచ్ బాత్రూం, కిచెన్ ఉండేలా ప్లాన్ రూపొందించింది.
అయితే నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో ప్రభుత్వం నిర్దేశించిన అంచనా, వాస్తవ ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలతో ఇల్లు సగం కూడా పూర్తయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఆర్థికంగా లేని నిరుపేదలు అదనపు మొత్తాన్ని సమకూర్చుకోవడం కష్టంగా మారుతోంది. అందువల్ల కేవలం ఆర్థిక సాయం అందించడం కాకుండా.. ఇంటిని ప్రభుత్వమే పూర్తి చేసి ఇవ్వాలని నిరుపేదల కోరుతున్నారు. లేదంటే పథకంతో పెద్దగా ప్రయోజనం ఉందడని అంటున్నారు. పైగా అప్పులు ఊబిలోకి నెట్టే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.
ఇల్లు నిర్మాణ దశ, ప్రభుత్వ చెల్లింపులు
పునాది పూర్తి చేసిన తర్వాత : రూ.1,00,000
బేస్మెంట్/ప్లింత్ స్థాయి : రూ.1,00,000
గోడల నిర్మాణ దశ : 1,00,000
స్లాబ్/పైకప్పు : రూ.1,00,000
ఇల్లు పూర్తయిన తర్వాత : రూ.1,00,000
ప్రభుత్వ మొత్తం సాయం : రూ.5,00,000
400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఖర్చు
పునాది నుంచి బెడ్ లెవెల్ వ : 2,00,000
గోడల నిర్మాణం స్లాబ్ లెవల్ : 2,50,000
స్లాబ్‌కు మెట్లతో కలిపి : 2,00,000
ప్లంబర్, ఎలక్ట్రికల్ వర్క్ : 1,00,000
తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ ఇతరత్రా : 1,00,000
మేస్త్రీ, కూలీల చార్జీలు : 2,60,000
మొత్తం నిర్మాణ వ్యయం : 11,10,000
(ఇది కూడా 400 చదరపు గజాల విస్తీర్ణంలో సాధారణంగా ఇల్లు నిర్మిస్తేనే)
మూలకు పడ్డ మోడల్ హౌస్!
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఐదు లక్షలతోనే ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టారు. కేసముద్రం మండల కేంద్రంలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన మోడల్ హౌస్ నిర్మాణం మూలకు పడింది. 5 లక్షల రూపాయల వ్యయంతో నమూనా మోడల్ హౌస్ పరిస్థితి ఇలా ఉంటే రూ.5 లక్షలు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.