హాట్ టాపిక్ గా మారిన రైల్వే పరిహారం వ్యవహారం
- ప్రభుత్వ ఆస్తుల పట్ల అధికారుల నిర్లక్ష్యం
- అనివార్యంగా మారిన జిల్లా అధికారుల విచారణ
సింగరేణి, అక్టోబర్04(విజయ క్రాంతి): రైల్వే డబుల్ లైన్(Railway double line) భూ నిర్వాసితులకు చెల్లించిన పరిహారంలో అక్రమాలు జరిగాయా? అన్న అంశం ఇప్పుడు సింగరేణి మండలంలో(Singareni Mandal) హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్రమ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించి అక్రమంగా యాజమాన్యాన్ని కల్పించడం, ఇంటి నెంబర్లను(House numbers) కేటాయించడం చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ భూముల్లో నివాసానికి ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేని,పై కప్పులు కూడా లేని రేకుల షెడ్లకు ఏ ఉద్దేశంతో ఇంటి నెంబర్లను కేటాయించారు?అనే చర్చ జిల్లా అధికారుల వరకు చేరింది. ప్రభుత్వ నిబంధనలను పాటించారా? లేదా? అనే కోణంలో జిల్లా అధికారులు లోతైన విచారణ చేసి అధికారులు తప్పు చేశారని తేలితే ప్రభుత్వ పరమైన కఠిన చర్యలు తీసుకుంటారా? లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విషయాన్ని నీరుగారుస్తారా? అనే కోణాల్లో మండల ప్రజల్లో చర్చ నడుస్తోంది.
అక్రమ వ్యవహారం ఆరోపణలపై పంచాయతీ కార్యదర్శి వివరణ తీసుకున్న మండల అధికారులు, జిల్లా అధికారులకు సమర్పించే తమ విచారణ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది.తప్పు జరిగితే జరిగినట్లు చూయిస్తారా? రికార్డుల్లో ఏమన్నా తారుమారు చేస్తారా?
అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల అధికారుల విచారణ నివేదిక ఆధారంగా జిల్లా అధికారులు సరైన విధానంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.