ఏటీఎం ఛార్జీలపై కీలక పరిణామం

26-09-2026 | 08:37am

బ్యాంకుల సమ్మె.. ATM ఛార్జీలకు బ్రేక్.. ఖాతాదారులకు గుడ్‌న్యూస్

బ్యాంకు ఖాతాదారులకు కీలక అప్‌డేట్. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు(Bank Strike) పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 26, 27 వారాంతపు సెలవులు కూడా కలవడంతో వరుసగా బ్యాంకింగ్ సేవలకు(Banking services) అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు సెప్టెంబర్ 27 ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేయనున్నాయి.

ఇదే సమయంలో ATM(ATM Withdrawal Charges) వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. సెప్టెంబర్ 28–30 సమ్మె రోజుల్లో SBI, PNB, Bank of Baroda, Union Bank, Indian Bank సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ATMలలో ఫ్రీ ట్రాన్సాక్షన్ పరిమితి దాటినా ATM విత్‌డ్రా ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాయి. సాధారణంగా RBI నిబంధనల ప్రకారం సొంత బ్యాంకు ATMలో నెలకు కనీసం 5 ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఇతర బ్యాంకుల ATMలలో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నెలకు 3, నాన్-మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలు లభిస్తాయి.

ఫ్రీ లిమిట్ దాటితే సాధారణంగా ఎంత ఛార్జీ? RBI నిబంధనల ప్రకారం బ్యాంకులు ఫ్రీ లిమిట్‌ దాటిన ATM లావాదేవీకి గరిష్ఠంగా రూ.23 + వర్తించే GST వరకు వసూలు చేయవచ్చు. అయితే ఈ మూడు సమ్మె రోజుల్లో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ ఛార్జీని మాఫీ చేస్తున్నాయి. అంటే సాధారణ రోజుల్లో లిమిట్ దాటితే రూ.23 + GST వరకు చెల్లించే పరిస్థితి ఉండొచ్చు.. కానీ సెప్టెంబర్ 28–30 మధ్య ఈ ఛార్జీ నుంచి ఖాతాదారులకు మినహాయింపు లభించనుంది. బ్యాంకును బట్టి నిబంధనలు మారే అవకాశం ఉన్నందున ఖాతాదారులు తమ బ్యాంకు అధికారిక ప్రకటనను కూడా పరిశీలించడం మంచిది.


మరిన్ని వార్తలు