అభివృద్ధికి కృషి చేయండి

23-09-2026 | 07:35pm

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఎంపీ, ఎంఎల్ఏలు పోరాడుకోవడం మాని అభివృద్ధికి క‌ృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్(BJP state vice president Raghunath) అన్నారు. బుధ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజక వర్గం ఎంఎల్ఏ పీఎస్ఆర్, ఎంపీ వంశీకృష్ణల మధ్య వర్గ విభేదాలతో అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ, ఎంపీలు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వదిలేసి పోటా పోటీగా ర్యాలీలు నిర్వహించడాన్ని చూసి జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవ చేశారు.

దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారితో బల నిరూపణ సభలు ఒక్కరి కంటే మరొకరు పెట్టిస్తూ ఎంఎల్ఏ, ఎంపీలు సవాల్ విసురుకోవడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం దళితులకు ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దళితులతో బల నిరూపణ సభలు ఒక్కరిని మించి మరొకరు పెడతామని ఎంఎల్ఏ, ఎంపీలు సవాల్ విసురుకోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు మరిచి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.

గంజాయి బ్యాచ్ ని పెంచి పోషించి ఇప్పుడు మంచిర్యాలలో గంజాయి బ్యాచ్ ని లేకుండా చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు రాజకీయ డ్రామాలు వీడి అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పట్టి వెంకట కృష్ణ, కమలాకర్ రావు, బియ్యాల సతీష్ రావు, అమిరిశెట్టి రాజ్ కుమార్, నాంపల్లి శ్రీనివాస్, పల్లి రాకేష్, జయరామ రావు, ఆడే ప్రేమ్ సింగ్, గాజుల ప్రభాకర్, ముల్కల్ల కుమార్, కొండ వెంకటేష్, రెడ్డిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు