రింగ్‌లో భారత బాక్సర్ సత్తా!

23-09-2026 | 12:39pm

రింగ్‌లో పంచ్‌ల వర్షం.. క్వార్టర్ ఫైనల్స్‌కు యువ బాక్సర్ 

నిషియో (జపాన్): ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోటీల్లో పురుషుల 80 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ అంకుష్ పంఘల్(Boxer Ankush Panghal ) అద్భుత విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ‘రౌండ్ ఆఫ్ 16’లో బహ్రెయిన్‌కు చెందిన హంసా వోగెల్‌తో(Hamsa Vogel) తలపడిన అంకుష్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించిన అతడు, జడ్జిల ఏకగ్రీవ నిర్ణయంతో 5-0 తేడాతో విజయం అందుకున్నాడు.

21 ఏళ్ల అంకుష్‌కు ఇవే తొలి ఆసియా క్రీడలు(Asian Games 2026). అయితే అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అతడు, గతేడాది ప్రపంచ బాక్సింగ్ కప్‌లో(World Boxing Cup) రజత పతకాన్ని కూడా అందుకున్నాడు. ఇప్పుడు అంకుష్ ముందు మరింత కీలక పోరు ఉంది. క్వార్టర్(quarterfinals ) ఫైనల్‌లో అతడు తజికిస్తాన్‌కు చెందిన నెక్రుజ్ సలీమోవ్‌ను ఎదుర్కోనున్నాడు. ఈ దశలో విజయం సాధిస్తే ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసిన అంకుష్ ఇప్పటికే తొలి అడ్డంకిని దాటేశాడు. ఇక తదుపరి బౌట్‌లోనూ అదే దూకుడు కొనసాగించి పోడియం దిశగా అడుగులు వేయాలని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు