బీఆర్‌ఎస్ పోరుబాట
ఆటో కార్మికుల హామీల అమలు చేయాలని డిమాండ్
ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నాగోల్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం చైతన్యపురి డివిజన్లోని బాబు కాంప్లెక్స్ నుంచి చైతన్యపురి వరకు ‘పోరుబాట’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధీర్రెడ్డి ఆటో నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, పద్మనాయక్, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు తోట మహేష్యాదవ్, లింగాల రాహుల్గౌడ్, ఓరుగంటి వెంకటేష్, చంద్రశేఖర్రెడ్డి, విశ్వప్రేమ్కుమార్, శివప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులను రోడ్డున పడేసింది..
బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచరణకు సాధ్యం కాని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై నిరసన కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ‘మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలం, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిన తీరును‘ నిరసిస్తూ సుచిత్ర చౌరస్తా నుండి జీడిమెట్ల గ్రామం గాంధీ విగ్రహం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలైనా 12 వేల రూపాయల కాదు కదా 12 పైసలు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ఒక్కో ఆటో కార్మికుడికి 36వేల రూపాయలను బాకీ ఉందని, రేవంత్ రెడ్డి ఈ బాకీ ని ఎప్పుడు చెల్లిస్తారో ఆటో కార్మికులకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
యధా రాజా తధా ప్రజా... అనే విధంగా రాష్ట్రంలో గుంపు మేస్త్రి వ్యవహరిస్తుంటే స్థానికంగా ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులు కార్లల్లో కొబ్బరికాయలు పెట్టుకొని తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ కొబ్బరికాయలు కొడుతూ చెడ్డి గ్యాంగ్ లా కొబ్బరికాయల గ్యాంగ్ తయారయ్యిందని ఆరోపించారు.మీరు ఎన్ని వేషాలు వేసిన ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ ని కోరుకుంటున్నారని రానున్న ఎన్నికల్లో కెసిఆర్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం,కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ మున్సిపాలిటీల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక సంక్షేమ సంఘాల సభ్యులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం..
ముషీరాబాద్ చౌరస్తాలో నిరసన.. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై నిరసన వ్యక్తం చేస్తూ ముషీరాబాద్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పార్శిగుట్ట నుంచి ముషీరాబాద్ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్వయంగా ఆటో నడిపించి నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
ఆటో డ్రైవర్లకు ప్రతినెల రూ.12వేలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు ఉపాధికరువై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులుపడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చుతామని హామీ ఇచ్చి నేటికి వెయ్యిరోజులు పూర్తికావస్తున్న ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో విఫలం చెందిన సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగుచెందిన ప్రజలు రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ను గెలిపించి కేసీఆర్ను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, ముషీరాబాద్ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు టి. సోమన్, శివముదిరాజ్, బీఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు, వల్లాల శ్యామ్ యాదవ్, నాయకులు కె. బాబురావు, ఎండీ మోహిన్, సదా, జార్జ్, పట్నం నరేష్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ భారీ ఆటో ర్యాలీ
మల్లాపూర్ నుంచి నాచారం వరకు నిరసన ప్రదర్శన పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి నాచారం వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.
ఆటో డ్రైవర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజా సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు.తాగునీటి కొరత, వీధి దీపాల లేమి, ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణ, బస్తీ దవాఖానల ఏర్పాటు వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా ఉంచుకుని ఈ ర్యాలీ చేపట్టారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ర్యాలీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, వైద్య సేవలు వంటి ప్రాథమిక అవసరాల కల్పనలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలను ప్రభుత్వం గుర్తించి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
ఉప్పల్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ర్యాలీ అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, ఆటో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






