బీఆర్‌ఎస్ సెల్ఫ్ గోల్

11-09-2026 | 05:15am

ప్రొ.సంగని మల్లేశ్వర్ :

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్(Bharat Rashtra Samithi) ప్రస్థానం ప్రత్యేకమైనదే. తెలంగాణ రాష్ట్ర సాధన(The Achievement of Telangana State) ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా(Political power) మలిచి 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి).. 2018లో మరింత బలమైన మెజారిటీతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు దశాబ్దం పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆ పార్టీ 2023 ఎన్నికల్లో(Elections) అధికారాన్ని కోల్పోయింది. ఈ మార్పు కేవలం ఒక ఎన్నికల ఓటమి కాదు. ప్రజలు ఇచ్చిన రాజకీయ సందేశం(Political message). ఆ సందేశాన్ని అర్థం చేసుకోకుండా పాత రాజకీయ పద్ధతులనే పునరావృతం చేస్తే మాత్రం చావు డప్పు కాంగ్రెస్‌(Congress)కు కాదు.. బీఆర్‌ఎస్‌కే మోగే ప్రమాదం ఉంది.

ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజల తీర్పును గౌరవించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కు. కానీ ప్రతి అంశాన్ని రాజకీయ రగడగా మార్చడం, సభలో గందరగోళం సృష్టించడం, ఆరోపణలకే పరిమితం కావడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత పెరగదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే గొంతు పెంచడం కాదు.. ప్రశ్నకు పదును పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి బీఆర్‌ఎస్‌కు పూర్తి హక్కు ఉంది. అయితే ఆ విమర్శలకు ఆధారాలు, గణాంకాలు, ప్రత్యామ్నాయ విధానాలు జత కావాలి.

‘కాంగ్రెస్‌ను పడగొడతాం’ అనే నినాదం కంటే ‘మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాం?’ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం రాజకీయంగా మరింత ప్రభావవంతంగా ఉంటుంది. శాసనసభ ప్రజల సమస్యలను చర్చించే అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక. గతంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, నిరసనలు, సస్పెన్షన్లు చోటుచేసుకున్న సందర్భాలు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఉన్నాయి. అధికారంలో ఎవరు ఉన్నా సభా నియమాలు అందరికీ సమానమే.

ప్రభుత్వం ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షం కూడా ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా లేవనెత్తాలి. అప్పుడే శాసనసభపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. నినాదాలతో వార్తల్లో నిలవడం తాత్కాలిక విజయం కావచ్చు. కానీ ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడం మాత్రమే శాశ్వత రాజకీయ బలం. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాళ్లు లేవని చెప్పడం వాస్తవికత కాదు. ఆర్థిక పరిమితులు, రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, విద్య, ఉద్యోగాలు, సంక్షేమ హామీల అమలు వంటి అనేక అంశాలు ప్రభుత్వానికి నిరంతర పరీక్షలే.

అయితే సవాళ్లు ఉన్నాయనే కారణంతో ప్రభుత్వం విఫలమైందని ముందుగానే తీర్పు ఇవ్వడం కూడా రాజకీయ తొందరపాటే అవుతుంది. ప్రస్తుతం 22 మంది ఎమ్మెల్యేలను ఈ సెషన్‌కి సస్పెండ్ చేస్తే బీఆర్‌ఎస్ రాద్ధాంతం చేస్తున్నది. అయితే, సభలో నిరసనలు, నినాదాలు, వెల్‌లోకి వెళ్లారనే కారణంతో గతంలో బీఆర్‌ఎస్ ఎంతమందిని సస్పెండ్ చేయలేదు? 1000 రోజుల పాలనపై నిలదీసే ముందు ప్రజలు ఎందుకు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు? తమ పార్టీ ఎందుకు ప్రజలకు దూరమైంది? రెండో శ్రేణి నాయకత్వం ఎంత బలంగా ఉంది? కార్యకర్తలతో సంబంధాలు ఎలా ఉన్నాయి? మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ ఎంతవరకు మారుతోంది? అని బీఆర్‌ఎస్ తనను తాను ప్రశ్నించుకోవాలి.

అయితే, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటే పారదర్శక పాలన, సంక్షేమానికి ప్రాధాన్యం, అభివృద్ధికి వేగం, సామాజిక న్యాయానికి స్పష్టమైన దిశ అవసరం. ప్రతిపక్షం చేసే విమర్శలకు ప్రభుత్వం వాస్తవాలతో సమాధానం చెప్పాలి. అదే ప్రజా పాలనకు అసలైన పరీక్ష. కాగా, బీఆర్‌ఎస్ గతాన్ని గుర్తుచేసుకోవడం కంటే తన భవిష్యత్ రాజకీయ మార్గాన్ని స్పష్టం చేయాలి.

నిరసనల పేరిట స్పీకర్‌ను అవమానపరిచి, దళితులు డప్పులతో నిరస న తెలిపిన దారిని శుద్ధి చేసి బీఆర్‌ఎస్ తన గొయ్యి తానే తీసుకుంది. అతి ఉత్సాహంతో ప్రజాసమస్యలను పాతరేసి సెల్ఫ్ అవుట్ అయ్యింది. అహంకారపూరిత నిర్వాకం మూలంగా బీఆర్‌ఎస్ పార్టీ తనకు తానే చావు డప్పు కొట్టుకుంటున్నది.

 వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ 

విభాగాధిపతి, 9866255355

మరిన్ని వార్తలు