ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

11-09-2026 | 04:25am

అసెంబ్లీ తర్వాత మరోసారి సమావేశం

ఉద్యోగ జేఏసీ నేతలకు సీఎం హామీ  

దసరాకు ముందే 51% ఫిట్‌మెంట్ ప్రకటించాలని జేఏసీ నేతల విజ్ఞప్తి 

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఆర్థిక శాఖతో సమావేశమై, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై, అన్ని అంశాలపై చర్చించి పరిష్కరిస్తామన్నారు.

ఉద్యోగ సంఘాల కోసం తన కార్యాలయ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘నా ఆఫీసు రచ్చబండ. తనను ఎప్పుడైనా కలవొచ్చు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిత్యం అందుబాటులో ఉంటుంది’ అని సీఎం స్ప ష్టం చేశారు. ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు,పెన్షనర్ల సమస్యలు  పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డితో పాటు పుల్గం దామోదర్‌రెడ్డి, బి.శ్యామ్, ముజీబ్ హుస్సేని, చావ రవి, సదానందం గౌడ్, భిక్షంగౌడ్, వెంకట్ తదితరులు గురువారం శాసనసభ ప్రాంగణంలోని ఆయన చాంబర్‌లో రేవంత్‌రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా వారు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా సీఎం సానుకూలంగా స్పందించారు. కాగా,  పీఆర్సీ నివేదిక తెప్పించుకుని దసరాకు 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, ఆరు పెండింగ్ డీఏల్లో కనీసం మూడు డీఏలను తక్షనం విడుదల చేయాలని జేఏసీ నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని, ప్రస్తుతం ప్రతి నెలా చెల్లిస్తున్న వెయ్యి కోట్ల రూపాయాలను రూ.2వేల కోట్లకు పెంచి, ఇందులో వెయ్యి కోట్లు ఉద్యోగులకు, మరో వెయ్యి కోట్లు పెన్షనర్లకు విడుదల చేయాలని విన్నవించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగే విధంగా సక్రమంగా అమలు చేయాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు