ఢిల్లీలో కుప్పకూలిన భవనం
ఐదుగురు మృతి
9 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు
శిథిలాల కింద మరో 15 మంది?
గాయాలైన వారికి ఏయిమ్స్ ట్రామా కేర్‌లో చికిత్స
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఢిల్లీ(Delhi)లో ఐదంతస్తుల పాత భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భవనంలో చిక్కుకుపోయిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఆర్‌కేపురంలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బేస్‌మెంట్‌లో తవ్వకాలు జరుగుతుండగా ‘హాస్టల్ డేస్’ అనే ఈ భవనం కూలిపోయిందని స్థానికులు తెలిపారు.
భవనంలో 25 మంది వరకు విద్యార్థులు ఉండొచ్చన్నారు. భవనం కూలిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఈ భవనం 50 ఏళ్ల క్రితం నాటిదని మొత్తం 25 గదులుండగా, 50 మంది వరకు విద్యార్థులు ఉండేవారని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళం, క్యాట్ అంబులెన్స్, అత్యవసర సేవల బృందాలు రెస్క్యూ చర్యలను చేపట్టాయి.
9 మందిని రక్షించగా, మరో 15 మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారిని ఏయిమ్స్ ట్రామా కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. గురుగ్రామ్‌లో ఉండే భవన యాజమాని ఆనంద్ బన్సల్‌గా గుర్తించి అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా కళాశాలలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, కార్యాలయాలు ఉండటంతో అత్యధికంగా విద్యార్థులు ఇక్కడ హాస్టళ్లు, పెయింగ్ గెస్ట్ భవనాల్లో ఉంటుంటారు.
సహాయక చర్యల్లో సీఎం రేఖాగుప్తా..
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా(CM Rekha Gupta) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆమె స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి దోషులను వదిలిపెట్టబోమన్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), కేంద్రమంత్రి అమిత్ షాలు విచారం వ్యక్తం చేశారు.
గాయపడిన వారికి అత్యాధునిక వైద్యం అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఆప్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో మంచి హాస్టల్‌లు లేకపోవడం వల్లే విద్యార్థులు ఇటువంటి భవనాల్లో ఉండక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.






