వినాయకుడి మండపాన్నే కొల్లగొట్టాడు
లడ్డూ, నగదు అపహరణ సీసీ కెమెరాల్లో దుండగుడి కదలికలు
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 20(విజయక్రాంతి): వినాయక చవితి వేళ భక్తులు పూజలు చేస్తున్న మండపాన్నే లక్ష్యంగా చేసుకుని ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. సైబరాబాద్ పరిధిలోని చందానగర్(Chandanagar) హుడా కాలనీలోని తేజ రెసిడెన్సీలో ఏర్పాటైన వినాయక మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మండపంలో నైవేద్యంగా ఉంచిన లడ్డూతో పాటు అక్కడ ఉన్న నగదును గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఘటన గుర్తించిన అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే చందానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పక్కా ప్రణాళికతోనే దుండగుడు మండపంలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండపం వద్ద ఏర్పాటైన సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి.ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సీసీ కెమెరా ఆధారాలతో నిందితుడిని త్వరలో పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.పండుగ సందర్భంగా మండపాల వద్ద భద్రత పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.