తాళం వేసి చిన్నారిని మర్చిపోయిండ్రు.. ఎక్కడంటే.!
ఇస్లాంపూర్: అధికారుల నిర్లక్ష్యంతో చిన్నారి తీవ్రంగా ఇబ్బంది పడింది. కరీంనగర్ జిల్లా(Karimnagar District) గంగాధర మండలం ఇస్లాంపూర్ గ్రామంలోని ఒక అంగన్‌వాడీ కేంద్రంలో మూడేళ్ల చిన్నారి గదిలో తాళం వేశారు. ఆ కేంద్రంలోని అంగన్‌వాడీ టీచర్ కొన్ని రోజుల పాటు సెలవులో ఉండటంతో మంగపేట టీచర్ మంజులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ గ్రామానికి చెందిన ఒక చిన్నారి తన తోటి విద్యార్థులతో కలిసి అంగన్‌వాడీ కేంద్రానికి(Anganwadi center) వెళ్లింది. పిల్లలను సాయంత్రం 4 గంటలకు ఇంటికి పంపించారు. ఆ చిన్నారి కేంద్రంలోని గదిలో నిద్రిస్తుండగా, ఆమెను గుర్తించని ఆయా అంగన్‌వాడీ గదికి తాళం వేసి వెళ్లిపోయింది.
తల్లిదండ్రులు ఆ చిన్నారి కోసం వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన పడ్డారు. ఆ బిడ్డ నిద్రలేచి ఏడవడం గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాత్రి 8 గంటలకు అక్కడికి హుటాహుటిన చేరుకుని, బిడ్డను బయటకు తీసుకువచ్చారు. ఆ చిన్నారి సుమారు నాలుగు గంటల పాటు ఆ కేంద్రంలోనే భయం భయతో గడిపింది. సమాచారం అందుకున్న ICDS CDPO నర్సింగరాణి ఆ కేంద్రానికి వెళ్లి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఆయా లచ్చమ్మ, ఇన్‌ఛార్జ్ ఉపాధ్యాయురాలు మంజుల, సూపర్‌వైజర్ సంతోషిలకు మెమో జారీ చేశారు.