పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం..
- ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా పల్లెలను తీర్చిదిద్దాలి.
- ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
- మంత్రి సీతక్క
ములుగు, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : పల్లెలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని(Plastic usage) పూర్తిగా నిషేధించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం మల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)లో పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛత హి సేవ’(Swachhata Hi Seva) కార్యక్రమంలో మంత్రి అనసూయ సీతక్క(Anasuya Seethakka), రూరల్ డెవలమెంట్ ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, మొక్కల పెంపకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
స్వచ్ఛత హి సేవ పక్షోత్సవాల్లో భాగంగా చేపట్టిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో మంత్రి సీతక్క మొక్కను నాటారు. పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. నిత్యం గ్రామాల పరిశుభ్రత కోసం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులను(Sanitation workers) మంత్రి ఘనంగా సన్మానించారు. కార్మికులకు సబ్బులు, కొబ్బరి నూనె, మాస్కులు, గ్లౌజులతో కూడిన పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ అడవులు, పచ్చదనం కారణంగానే ములుగు జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ప్రకృతే మానవాళికి, జీవరాశులకు జీవనాధారమని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ సురేష్ బాబు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, డిపిఓ వెంకయ్య, డిఆర్ డి ఓ రవీందర్, యంపిఓ రహీం, ఏపిడి, స్వచ్ఛ భారత్ మిషన్ డిస్టిక్ కో ఆర్డినేటర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.