ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం నిర్వహించాలి

25-09-2026 | 07:22pm

ఎస్పీ సునిత రెడ్డి

వనపర్తి మండలం సెప్టెంబర్ 25: గణేష్ నిమజ్జనం చివరి రోజు సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి(Wanaparthy District SP Sunitha Reddy), ఐపీఎస్., డీఎస్పీతో కలిసి నల్లచెరువు(Nallacheruvu) నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా టౌన్ ఎస్సై హరిప్రసాద్, రూరల్ ఎస్సై రుషికేశ్‌తో పాటు పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భక్తులకు పటిష్టమైన భద్రత కల్పిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఇన్ని రోజులుగా పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందిస్తూ, చివరి రోజు కూడా అదే అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు.ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి వెలుతురు ఉండగానే విగ్రహాలను నిమజ్జన ప్రాంతానికి తరలించాలని ఎస్పీ సూచించారు. డీజేలు, బాణాసంచా విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

నిమజ్జన ప్రాంతంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత పోలీసు సిబ్బంది, కాంట్రాక్టర్‌కు సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ సునిత రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు