ఎస్గీలో నాలుగు రకాల చెత్త సేకరణ ప్రారంభం

21-09-2026 | 04:18pm

పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ లక్ష్మణ్ నాయక్

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల పరిధిలోని ఎస్గి గ్రామంలో సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై(Solid Waste Management) గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వెలువడే చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి చెత్త, పొడి చెత్త, గృహ హానికర వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలుగా నాలుగు రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు.ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో నాలుగు రకాల చెత్తను వేర్వేరుగా సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

ప్రజలు తమ ఇళ్ల వద్దనే చెత్తను వర్గీకరించి గ్రామ పంచాయతీ చెత్త సేకరణ వాహనానికి అందించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, మురుగు కాలువల్లో చెత్త వేయడం వల్ల దుర్వాసనతోపాటు దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం బాధ్యతగా సహకరించాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, గ్రామస్థులకు అవగాహన కల్పించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగప్ప, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు