వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్,సెప్టెంబర్ 25(విజయ క్రాంతి):2026-27 వానకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు కొరకు కొనుగోలు కేంద్రాలలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్(Collectorate) పవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి వరి ధాన్యం కొనుగోలు, కొనుగోలు కేంద్రాలలో ఏర్పాట్లపై వ్యవసాయ విస్తరణ అధికారులు, సహకార శాఖ, ఐ. కె. పి. సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ లో 23 వేల 900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, అక్టోబర్ 1 తేదీన జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు, త్రాగునీరు, నీడ, వెలుతురు ఉండేలా, కొనుగోలు కేంద్రాలను ఎత్తైన చదును ప్రదేశాలలో, రహదారికి దగ్గరగా వాహనాలు వెళ్లేలా గుర్తించాలని తెలిపారు..
సరిపడా గోనె సంచులు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు, డ్రయర్లు ఉండేలా, ప్రతి కొనుగోలు కేంద్రంలో 2 ఎలక్ట్రానిక్ టూ కం యంత్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచాలని, 17 శాతం లోపు తేమ ఉండేలా, తాలు, దుమ్ము లేకుండా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని, క్రమ పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు.
టూకం వేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైతు మిల్లులకు తరలించాలని, వరి ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన గోదాములను సిద్ధం చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వసతులు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, ప్యాడి క్లీనర్లు, డ్రయర్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, మద్దతు ధర, సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ వంటి వివరాలు రైతులకు తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి కొనుగోలు చేపట్టాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, జిల్లా పౌర సరఫరాల అధికారి వాజీద్, జిల్లా సహకార అధికారి, ఐ కె పి ఎ.పి.ఎం.లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వ్యవసాయ విస్తరణ అధికారులకు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.