విమానానికి ఏమైంది?.. వీడియో వైరల్
కాంగోలో ఆకాశం నుంచి ఒక్కసారిగా కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి
కాంగో: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం(Congo Aviation Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరుగు ప్రయాణమైన విమానం కేంజ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 14 మంది(Congo Plane Crash 14 Dead) ప్రాణాలు కోల్పోయినట్లు కాంగో సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో కాంగో సైనిక న్యాయ వ్యవస్థకు చెందిన ఇద్దరు కీలక అధికారులు కూడా మృతి చెందారు. సైనిక న్యాయస్థానం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండె, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా మృతుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కిక్విట్ నుంచి కిన్షాసా వెళ్తున్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య(Technical issue) తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం కేంజ్ ప్రాంతంలో విమానం కూలిపోయింది. అయితే ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని కాంగో(Congo Plane Crash) సైన్యం తెలిపింది. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో తూర్పు కాంగోలో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. పలు సాయుధ తిరుగుబాటు గ్రూపులతో కాంగో సైన్యం పోరాడుతోంది. అందులో రువాండా మద్దతు ఉందని కాంగో ఆరోపిస్తున్న M23 గ్రూప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో సైనిక అధికారుల మృతితో ప్రమాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.