దిగిపోవాల్సిందే

30-09-2026 | 05:35am

సీఈసీ జ్ఞానేశ్‌తోపాటు మోదీ, అమిత్‌షా రాజీనామా చేయాలి

  1. ఓట్ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం 
  2. స్వాతంత్య్ర పోరాటం తరహాలో ముందుకు..! 
  3. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలి.. ‘సర్’ను నిలిపివేయాలి 
  4. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో డిమాండ్లు, తీర్మానాలు 
  5. ఖర్గే అధ్యక్షతన సమావేశమైన కమిటీ 
  6. ఓట్ చోరీని వెలుగులోకి తెచ్చారని రాహుల్‌కు అభినందనలు
  7. రెండేండ్ల క్రితం చెప్తే ఎవరూ నమ్మలేదు.. ఇప్పుడు అంతా నమ్ముతున్నారన్న రాహుల్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఎన్నికల ప్రధానాధికారి(Chief Electoral Officer) (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌తో(Gyanesh Kumar) పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Congress Working Committee) (సీడబ్ల్యూసీ) డిమాండ్ చేసింది. ఓట్ల చోరీ కి పాల్పడుతున్నారని, దీనిపై దేశవ్యాప్తం గా ఉద్యమం చేపడుతామని, స్వాతంత్య్ర పోరాటం తరహాలో ముందుకు సాగుతామని తీర్మానించింది. సీఈసీని అడ్డు పెట్టుకొని మోదీ, అమిత్ షా ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టించారని, ఓట్ల చోరీతోనే అధికారంలోకి వచ్చారని కమిటీ ఆరోపించింది.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశమైంది. ఇందులో సోని యాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పలు డిమాండ్లు, తీర్మానా లు చేశారు. ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా ఉద్యమంలా తీసుకుపోవాలని, కాంగ్రెస్ శ్రేణులంతా రోడ్లమీదికి వచ్చి కేంద్రంలోని మోదీ సర్కార్ తీరును ఎండగట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈసీలోని ఇతర కమిషనర్ల నిర్ణయాలకు పరిగణనలోకి తీసుకోకుండా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నా రని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని సీడబ్ల్యూసీ సమావేశం డిమాండ్ చేసింది. బీజేపీతో జ్ఞానేశ్‌కుమార్ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించింది. ఇప్పటివరకు ‘సర్’ పేరిట తొలగించిన 13కోట్లకుపైగా ఓట్లను తిరిగి చేర్చాలంది. ‘సర్’ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. 

పార్లమెంట్‌లో, బయట ఉద్యమం..

ఓట్ చోరీ అంశంతోపాటు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా కోసం ఇటు వీధుల్లోనూ, అటు పార్లమెంట్ సమావేశాల్లోనూ ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రతి వేదికపైనా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో పోరాడుదామని పేర్కొంది. సీఈసీ జ్ఞానేశ్‌పై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెటాలని నిర్ణయించింది. ఓట్ల చోరీ అంశాన్ని బయటకు తీసుకువచ్చినందుకు రాహుల్‌గాంధీని కమిటీ అభినందించింది. రెండేండ్ల క్రితం ఆయనే ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారని, ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారుతున్నదని తెలిపింది. 

అప్పుడు ఎవరూ నమ్మలేదు: రాహుల్ 

దేశంలో ఓట్ల చోరీ జరుగుతున్నదనే విషయాన్ని తాను రెండేండ్ల క్రితం బయటపెట్టినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదని, ఇప్పుడు అందరూ అదే అంశంపై చర్చించుకుంటున్నారని సీడబ్ల్యూసీ సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ‘ఓట్ చోరీ అంశంపై నేను అనేకసార్లు అనేక వేదికలపై మాట్లాడాను. తొలుత మన పార్టీ నేతలే దీన్ని అంగీకరించలేదు. నాతో కలిసి నడవలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు. చాలామంది ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే స్పందిస్తూ.. ‘మేమంతా మీ వెనుక నడుస్తాం’ అని చెప్పినట్లు తెలిసింది.

అయితే, దీనికి రాహుల్ బదులిస్తూ ‘మరీ వెనకాల లేరు కదా!’ అని నవ్వుతూ వ్యాఖ్యానించగా.. ‘లేదు లేదు.. మీతోపాటు నడుస్తాం’ అని ఖర్గే అనడంతో సమావేశంలో నవ్వులు విరబూసినట్లు ఓ నాయకుడు తెలిపారు. కాగా.. దేశంలో రెండు రకాల మ్యాచ్‌ఫిక్సింగ్ జరుగుతున్నదని, ఇందులో ఒకటి ఈవీఎంలది, మరోటి ఓటర్ల జాబితా సవరణకు సంబంధించింది అని రాహుల్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌తో కలిసి మోదీ, అమిత్ షా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌తోపాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. 

నాడు నోట్ బందీ.. ఇప్పడు ఓట్ బందీ: ఖర్గే

పదేండ్ల క్రితం ‘నోట్ బందీ (పెద్ద నోట్ల రద్దు)’ పేరిట దేశ ఆర్థికవ్యవస్థను ప్రధాని మోదీ కుప్పకూల్చారని.. ఇప్పుడు ‘ఓట్ బందీ (ఓట్ల రద్దు)’ కుట్ర ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ముఖ్యంగా మోదీకి వ్యతిరేకంగా ఉన్నారని జెన్ జీ యువత ఓట్లను తొలగించేందుకు ప్లాన్ చేశారని దుయ్యబట్టారు. సీఈసీకి ఏమాత్రం పదవిలో కొనసాగే హక్కులేదని ఆయన అన్నారు. దేశంలో ఏ ఒక్కరు కూడా ఓటును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా దీన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. 

శశి.. మీరు వస్తారు కదా!: ఖర్గే 

సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్ నేత శశిథరూర్‌కు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలిసింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని, లేకపోతే ఆరోజును బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంటుందని శశి థరూర్ పేర్కొన్నారు. దీనికి ఖర్గే బదులిస్తూ..‘శశి.. మనం ఆ రోజు కార్యక్రమం చేపడుదాం. అయితే, మీరు వస్తారు కదా! లేకపోతే.. సోషల్ మీడియాలోనో, న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ రూపంలోనో మిమ్మల్ని చూసుకోవాల్సి ఉంటుందా?’ అని అడిగారు. గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా శశిథరూర్ ఉండటంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు