వైద్య వీసా మాటున నేరాల నెట్‌వర్క్!
భారతదేశం నేడు ప్రపంచ పటంలో కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా మాత్రమే కాకుండా, అగ్రశ్రేణి వైద్య పర్యాటక కేంద్రంగా(మెడికల్ టూరిజం హబ్) కూడా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు(Infrastructure), ప్రపంచ స్థాయి నిపుణులైన వైద్యులు, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం సునాయాసంగా చేయగల నైపుణ్యం, అన్నింటికీ మించి పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందుబాటులో ఉండటం వంటి కారణాలు భారత్‌ను వైద్య పర్యాటకానికి కేరాఫ్‌గా మార్చాయి.
ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల(Asian countries) నుంచి ప్రతి ఏడాదీ లక్షలాది మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో, అవయవ మార్పిడి వంటి క్లిష్టమైన చికిత్సల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన దేశానికి వస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదపడటంతో పాటు, ప్రాణదాతగా అంత ర్జాతీయ సమాజంలో భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్న సానుకూల పరిణామం. అయితే, మానవతా దృక్పథంతో మనం తెరిచిన ఈ ‘వైద్యం తలుపుల’ను కొందరు అసాంఘిక శక్తులు తమ నేర సామ్రాజ్య విస్తరణకు రాజమార్గంగా మలచుకుంటుండటం ఇప్పుడు దేశ భద్రతా వ్యవస్థకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
విదేశాల నుంచి వైద్య వీసా (మెడికల్ వీసా) మీద చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించి, ఆ తర్వాత అదృశ్యమైపోయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్న వార్తలు, పోలీసుల దర్యాప్తుల్లో వెలుగుచూస్తున్న విస్తుపోయే వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చికిత్స పేరుతో ఇక్కడికి రావడం, ఆస్పత్రిలో మొక్కుబడిగా ఒకట్రెండు రోజులు చేరినట్లు నటించడం, ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా కళ్లుగప్పి మాయమైపోవడం ఒక వ్యవస్థీకృత నేరంగా మారుతోంది.
వీసా గడువు ముగిసినా తిరిగి తమ దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఏళ్ల తరబడి తిష్టవేస్తున్న విదేశీయుల వ్యవహారం ఇప్పుడు ఒక జాతీయ భద్రతా సమస్య. ఒక నగరంలో అడుగుపెట్టి, మరో నగరానికి మకాం మార్చడం, తమ అసలు పేర్లను మార్చుకుని స్థానికులుగా చెలామణి అవ్వడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ముఖ్యంగా నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించడంలో వీరు చూపుతున్న నైపుణ్యం దర్యాప్తు సంస్థలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. స్థానిక దళారుల సాయంతో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఓటరు గుర్తింపు పత్రాలు సైతం సంపాదించి, ఇక్కడి పౌరుల్లాగే జీవిస్తూ మాదకద్రవ్యాల రవాణా, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో మనం ఒక స్పష్టమైన వాస్తవాన్ని గుర్తించాలి. విదేశీయుడు కావడం నేరం కాదు, విదేశీయులంతా నేరస్థులు కారు. అలాగే వైద్య వీసాపై భారత్‌కు రావడం అనేది పూర్తిగా చట్టబద్ధమైన హక్కు. నేరం చేసే వ్యక్తి ఏ దేశానికి, ఏ ప్రాంతానికి చెందినవాడైనా చట్టం ముందు సమానమే. అయితే.. ఇక్కడ అసలు సమస్య విదేశీయులతో లేదు.
మన వీసా మంజూరు వ్యవస్థలోని లొసుగులు, పర్యవేక్షణలోని డొల్లతనం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాలను ఆసరాగా చేసుకుని వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న విధానంతోనే ఉంది. వైద్యం కోసం వచ్చిన విదేశీయుడు చికిత్స అనంతరం ఎక్కడికి వెళ్లాడు? వీసాలో పేర్కొన్న చిరునామాలోనే ఉంటున్నాడా? అతనికి వైద్యం చేసిన ఆస్పత్రి నివేదికలు ఏం చెబుతున్నాయి? వీసా గడువు ముగిసిన తర్వాత అతను దేశం దాటాడా లేదా? వంటి కనీస ప్రశ్నలకు జ వాబులు వెతికే పటిష్టమైన యంత్రాంగం మన వద్ద లేకపోవడమే ఈ నేరాలకు ప్రధాన కారణం.
గుర్తింపు మార్పిడి అనేది ఈ విదేశీ నేరగాళ్లు ఆశ్రయిస్తున్న అత్యంత ప్రమాదక రమైన వ్యూహం. ఒక పేరుతో వీసా పొంది, స్థానికంగా మరో పేరుతో చెలామణి కావడం వల్ల సాధారణ పోలీస్ గస్తీ లేదా తనిఖీల్లో వీరిని పసిగట్టడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) సిండికేట్ల లో ఈ తరహా విదేశీయుల పాత్ర అత్యంత కీలకంగా మారుతోంది. వీరు తమ నెట్‌వర్క్‌లను చిన్నచిన్న సెల్స్‌గా, గొలుసుకట్టు విధానంలో విభజించుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఒకరు సరుకు తెస్తే, మరొకరు నిల్వ చేయడం, ఇంకొకరు సరఫరా చేయడం, మరొకరు ఆర్థిక లావాదేవీ లు చూసుకోవడం.. ఇలా ఎవరికీ మరొకరి పూర్తి వివరాలు తెలియని రీతిలో నెట్‌వర్క్ నడుపుతున్నారు. దీంతో పోలీసులు ఏదైనా ఒక డ్రగ్ కేసును ఛేదించి కింద స్థాయి పంపిణీదారులను పట్టుకున్నా, అసలు సూత్రధారుల (కింగ్‌పిన్స్) వరకు చేరుకోవడం దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారుతోంది.
ఈ వైఫల్యాల వెనుక ఆస్పత్రుల పాత్ర, వారి జవాబుదారీతనం గురించి కూడా మనం తీవ్రంగా చర్చించుకోవాలి. నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉండి, అత్యవసర వైద్య సేవలు అవసరమైన విదేశీ రోగులను సాదరంగా ఆహ్వానించడం, వారికి నాణ్యమైన చికిత్స అందించడం ఆస్పత్రుల కనీస ధర్మం. కానీ, వైద్య రంగాన్ని కేవలం ఒక లాభదాయక వ్యాపారంగా, వాణిజ్య కోణంలో మాత్రమే చూస్తున్న కొన్ని ఆస్పత్రులు, క్లినిక్‌లు పరోక్షంగా ఈ నేరాలకు సహకరిస్తున్నాయి.
విదేశాల్లో కూర్చున్న ఏజెంట్లు లేదా దళారులు అడిగిందే తడవుగా, కనీస ఆధారాలు సరిచూసుకోకుం డా తప్పుడు వైద్య పత్రాలు (ఫేక్ మెడికల్ ఇన్విటేషన్ లెటర్స్) జారీ చేస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఒక రోగికి చికిత్సకు పట్టే వ్యవధి కంటే రెట్టింపు సమయాన్ని చూపిస్తూ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ద్వారా వీసా గడువును పెంచేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా వ్యవస్థలోని నియమ నిబంధనలను ఆస్పత్రి యాజమాన్యాలు పక్కనపెడితే, భవిష్యత్తులో దాని విపత్కర ప్రభావం మొత్తం భారతీయ వైద్య పర్యాటక రంగం విశ్వసనీ యతపైనే పడుతుంది.
దళారుల వ్యవస్థను ఉక్కుపాదంతో అణచివేయడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. విదేశాల్లో కూర్చుని భారత్‌లో వైద్య చికిత్స పేరుతో వ్యక్తులను పంపుతున్న ఏజెంట్లు ఎవరు? వారికి ఇక్కడి ఆస్పత్రులతో ఉన్న ఆర్థిక సంబంధాలు ఏమిటి? వీసా కోసం వారు సమర్పిస్తున్న పత్రాలు ఏమిటి? అన్న విషయాలపై నిఘా వర్గాలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. అలాగే చికిత్స అనంతరం ఆ రోగి తిరిగి తన దేశానికి పయనమయ్యాడా? అనే ఈ మొత్తం ప్రక్రియలో ప్రతి అంచెలోనూ జవాబుదారీతనం ఉండేలా కఠిన మార్గదర్శకాలు రూపొందించాలి.
వైద్య వీసా దుర్వినియోగాన్ని కేవలం స్థానిక శాంతిభద్రతల సమస్యగా, పోలీసింగ్ వైఫల్యంగా మాత్రమే చూస్తే అసలు పరిష్కారం దొరకదు. ఇది వీసా జారీ చేసే విదేశీ వ్యవహారాల శాఖ, ఇమ్మిగ్రేషన్ విభాగం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేటు వైద్య సంస్థలు, స్థానిక పోలీసు వ్యవస్థ, ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో), ఆధార్ జారీ చేసే ‘ఉడాయ్’ (యూడీఏఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) వంటి అత్యున్నత సమన్వయంతో పనిచేయాల్సిన అత్యంత క్లిష్టమైన అంశం.
ప్రత్యేకంగా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో చట్టవిరుద్ధంగా ఉండిపోయే విదేశీయులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూ ర్తి స్థాయిలో వాడుకోవాలి. చికిత్స వ్యవధి, ఆస్పత్రి వివరాలు, రోగి ఆస్పత్రిలో చేరిన తేదీ, చికిత్స ముగిసిన తేదీ, వీసా గడువు, తిరుగు ప్రయాణ వివరాలు వంటి అంశాలను ఆస్పత్రి యంత్రాంగం ఎప్పటికప్పు డు ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసేలా ఒక కేంద్రీకృత డిజిటల్ పోర్టల్‌ను అభివృద్ధి చేయా లి.
అలాగే, ఎయిర్‌పోర్టులో దిగిన 48 గంటల్లోగా సంబంధిత ఆస్పత్రిలో రిపోర్ట్ చేయకపోయినా, అకస్మాత్తుగా ఆస్పత్రి నుంచి మాయమైపోయినా వెంటనే సం బంధిత ఇమ్మిగ్రేషన్, పోలీస్ వ్యవస్థలకు ’ఆటోమేటిక్ అలర్ట్’ (రెడ్ ఫ్లాగ్) వెళ్లే విధానం తక్షణమే అమలులోకి రావాలి. ఇది నిరంతరం అందరిపై నిఘా పెట్టడం కాదు, కేవలం నిబంధనలు ఉల్లంఘించిన అనుమానాస్పద కేసుల్లో మాత్రమే లక్ష్యిత పర్యవేక్షణ (టార్గెటెడ్ సర్వైలెన్స్) చేపట్టే అత్యంత సమర్థవంతమైన విధానం.
మరోవైపు, స్థానికంగా వేళ్లునుకుంటున్న డ్రగ్స్ నెట్‌వర్కులను సమూలంగా నాశనం చేయాలంటే దర్యాప్తు సంస్థల దృక్పథం మారాలి. కేవలం దొరికిన సరుకును సీజ్ చేసి, ఇద్దరుముగ్గురు సరఫరా దారులను అరెస్టు చేసి చేతులు దులుపుకోవడం సరిపోదు. ఆ విదేశీయులకు నకిలీ ఆధార్, పాన్‌కార్డులు, అద్దె ఇళ్లు ఎవరు సమకూర్చారు? వారి స్థానిక బినామీలు ఎవరు? వారికి డబ్బు ఎవరు పంపుతున్నారు? అనే లోతైన ప్రశ్నలకు సమాధా నాలు కనుగొనాలి.
ఈ కఠిన చర్యలన్నీ తీసుకునే క్రమంలో ఒక సున్నితమైన మానవతా అంశాన్ని ఏమాత్రం విస్మరించకూడదు. వైద్య వీసా అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమే కాదు, అది నిస్సహాయ స్థితిలో, ప్రాణాపాయంలో ఉన్న ఒక అనారోగ్య పీడితుడికి ప్రాణం పోసే మార్గం. కొందరు క్రిమినల్స్ చేస్తున్న దుర్వినియోగం కారణంగా, ఎక్కడో ఆఫ్రి కా మూలల నుంచి తమ పిల్లల గుండె ఆపరేషన్ కోసమో, క్యాన్సర్ చికిత్స కోస మో ఆశగా వచ్చే నిజమైన రోగులపై అనవసరమైన అనుమానాలు, కఠినతరమైన నిబంధనలు రుద్దకూడదు. ఆస్పత్రులు సైతం తాము నిర్వహిస్తున్నది కేవలం వ్యాపారం కాదని, అత్యంత పవిత్రమైన వైద్య వృత్తి అని, తమకు దేశ భద్రత పట్ల సామాజిక బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలి.
తప్పుడు డాక్యుమెంట్లు, అనుమానా స్పద రోగుల ప్రవర్తన కనిపిస్తే తక్షణం పోలీసులను అప్రమత్తం చేయాలి. భారత్ భవిష్యత్తులో ప్రపంచానికే అతిపెద్ద వైద్య సేవల కేంద్రంగా, ’హీలింగ్ డెస్టినేషన్’గా ఎదగాలంటే మన వ్యవస్థల పట్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత అత్యంత ము ఖ్యం. విదేశీ రోగులకు భారత్ అత్యంత సురక్షితమైన, నాణ్యమైన, అత్యుత్తమ వైద్య గమ్యస్థానంగా కనిపించాలి. అదే సమయంలో దేశ సార్వభౌమాధికారం, అం భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. ప్రాణాలు కాపాడేందుకు తెరిచిన వైద్యం తలుపు.. దేశాన్ని నాశనం చేసే నేరాలకు తెరిచిన దారిగా ఏమాత్రం మారకూడదు.
వ్యవస్థను నేరాలకు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తే జరిగే నష్టం కేవలం పోలీస్ విభాగానికో, చట్టానికో కాదు.. మొత్తం భారతీయ వైద్య రంగానికి, మన విశాల హృదయానికి, అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న మహోన్నత ప్రతిష్ఠకు కలుగుతుంది. ప్రాణాపా యంలో ఉన్న నిజమైన రోగికి భారతదేశం ఎప్పుడూ ’స్వస్థతకు చిరునామా’గానే ఉం డాలి తప్ప.. మాదకద్రవ్యాల స్మగ్లర్లకు, నేరస్థులకు దాక్కునే ’సురక్షిత స్థావరం’గా మా త్రం ఎన్నటికీ మారకూడదు. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలు సమష్టిగా కదిలితేనే వైద్య పర్యాటకం దాని నిజమైన లక్ష్యాన్ని చేరుకుంటుంది.
- సీనియర్ జర్నలిస్టు,
హైదరాబాద్, 9912483642
నండూరి రవిశంకర్