నిబంధనలు పాటించని డయాగ్నొస్టిక్ సెంటర్ సీజ్
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు మండలం(Yellandu Mandal)లోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామదాస్, పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్ల రికార్డులు, అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట నిబంధనలను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో పలు లోపాలను గుర్తించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను సీజ్ చేశారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలు గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.