రోగాలు జోరు.. వైద్యం అందక బేజారు

19-09-2026 | 05:20am
  1. సీజనల్ వ్యాధుల తో రోగుల కిటికీట
  2. ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 600 పై చిలుకు ఓపి
  3. పడకలు చాలక ఒకే మంచంపై ఇద్దరు రోగులు
  4. ఆసుపత్రి స్థాయి పెంచాలని డిమాండ్

ఖానాపూర్ .సెప్టెంబర్ 18. (విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణ(Khanapur town) పరిసర ప్రాంతాల ప్రజల అవసరాల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో రోగుల సంఖ్య పెరిగిన వైద్యం మాత్రం అంతంత గానే ఉందని ప్రజల విమర్శిస్తున్నారు. పేరుకి పెద్ద ఆస్పత్రి అయినప్పటికీ అక్కడ రోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అనారోగ్యం(Illness)తో వస్తున్న రోగులకు సరైన వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఖానాపూర్ ప్రాంతంలోని ఖానాపూర్ కడెం పెంబి, దస్తురాబాద్ ప్రాంతంలో వైరల్ జ్వరాలు, డయేరియా(Viral fevers, diarrhea) ఇతర జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

పేదరికంలో ఉన్న ప్రజలు అనారోగ్యం ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుంటున్నారు. ప్రైవేట్ లో వేలకు వేలు ఖర్చు చేసి స్తోమత లేని నిరుపేదలు ప్రభుత్వ వైద్యంపై నమ్మకంతో ఆసుపత్రిలో వచ్చి చికిత్స పొందుతున్నట్లు చెప్తున్నారు.  ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 600కు పైచిలుకు అవుట్ పేషెంట్ చికిత్సలు(Outpatient treatments) నమోదు కావడం విశేషం. ఈ నేపథ్యంలో రోగులకు ఆసుపత్రిలో అరకొర వసతులతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

చేసేదిలేక వందల కొద్ది రోగులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు, మరికొందరు నిర్మల్, నిజామాబాద్ పట్టణాలకు చికిత్స కోసం తరలిపోతున్నారు. దీంతో రోగుల కుటుంబాలకు ఆర్థిక భారం పడి నానా అవస్థలు పడుతున్నామని పలువురు వా పోతున్నారు.కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో చాలినంత  మంది వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ వైరల్ జ్వరాలకు కనీసం నాలుగు రోజులు ఇన్ పేషెంట్గా ఉండి చికిత్స చేయించుకుందామంటే చాలిన పడకలు అందుబాటులో లేకపోగా పరిస్థితులకు అనుగుణంగా రోగులు తప్పనిసరి ప్రైవేటుకు తరలిపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం పేద ల వైద్యానికి పెద్దపీట వేస్తున్నప్పటికీ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయకపోవడంతో ఈ అవస్థలు ఎదురవుతున్నట్లు పలువురు అంటున్నారు. దశాబ్దాల కాలంగా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి కేవలం 50 పడకల ఆసుపత్రి గానే సేవలను అందిస్తుంది. అయితే ఎపిడమిక్ పరిస్థితుల్లో ఆసుపత్రిలో సరైన వసతులు, పడకలు ,టాయిలెట్లు, మందులు, అందుబాటులో ఉండవని పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ ఆ దిశగా పాలకులు, చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

దీంతో క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బంది రోగులకు చికిత్స చేయడానికి ఒకే మంచంపై ఇద్దరిని పడుకోబెట్టడం పరిపాటయింది. సందులో సడే మియా గా పడకలు సరిపోవడంలేదని స్థానికంగా ఉన్న కొంతమంది సిబ్బంది ఏజెంట్లు రోగులను ప్రైవేటుకు వెళ్ళమని సూచిస్తున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని కట్టడి చేయాలంటే ఆసుపత్రి స్థాయిని పెంచి రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే, నాయకులు ప్రయత్నం చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పది రోజులుగా ఆసుపత్రిలో ప్రతిరోజు వైద్యం కోసం తండోపతండాలుగా రోగులు తరలివస్తుండడం గమనార్హం .ఈ నేపథ్యంలో రోగులకు కనీస అవసరం పడకలు కేటాయించలేక సిబ్బంది అవస్థలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు .ఇకనైనా నాయకులు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

మరిన్ని వార్తలు