7 September, 2026 | 8:31 AM

సభను విరమించుకోండి!

07-09-2026 | 05:35am
  1. ఉద్యోగ జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి    
  2. హామీ ఇవ్వకుండా ఎలా?: జేఏసీ నేతలు 
  3. డీఏల చెల్లింపు, పీఆర్సీ అమలుపై డిమాండ్
  4. ఈహెచ్‌ఎస్ అమలులో రాజీ పడం: భట్టి
  5. సభ నిర్వహణపై నేటికి గడువు కోరిన జేఏసీ

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఈ నెల 10న చలో హైదరాబాద్ పేరుతో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తలపెట్టిన భారీ బహిరంగ సభను విరమించుకోవాలని ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) జేఏసీ నేతలను కోరారు. ఈహెచ్‌ఎస్ స్కీం (EHS Scheme) అమలుపై ఆదివారం ప్రజాభవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులతో కలిసి భట్టి సమావేశం నిర్వహించారు.

హెల్త్ స్కీంను పకడ్బందీగా అమలు చేయాలని, రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు సహకరించాలని కోరారు. ఆసుపత్రుల యాజమాన్యానికి ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నప్పుడు ఉద్యోగులకు ఎందుకు క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించరని సీరియస్ అయినట్లు తెలిసింది. అలాగే ఈనెల 10న తలపెట్టిన ఉద్యోగుల బహిరంగ సభను విరమించుకోవాలని ఉద్యోగ జేఏసీ నేతలను కోరినట్లు తెలిసింది. ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని నేతలతో భట్టి చెప్పినట్లుగా సమాచారం.

దీనికి జేఏసీ నేతలు స్పందిస్తూ ఆరు పెండింగ్ డీఏలు, పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు లాంటి దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించకుండా తాము సభను రద్దు వేయలేమని, ఆరు డీఏల్లో కనీసం రెండు లేదా మూడైనా విడుదల చేస్తామని, పీఆర్సీ రిపోర్టు తెప్పించుకుంటామని ఒక హామీ ఇస్తే సభ విరమణపై ఆలోచిస్తామని నేతలు చెప్పినట్లుగా తెలిసింది. అయినా ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదని, జేఏసీలోని సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వానికి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ సోమవారం ఉదయం 9 గంటలకు అత్యవసర సమావేశం కానుంది. సభ నిర్వహించాలా? విరమించుకోవాలా? అనే అంశంపై స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే సభకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. పైగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్న నేపథ్యంలో సభను విరమించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు జేఏసీ నేతల తీరుపై క్షేత్రస్థాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 

ఈహెచ్‌ఎస్ అమలులో రాజీ లేదు: భట్టి 

ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రజాప్రభుత్వం నిబద్ధతతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్ల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డు పథకాన్ని తీసుకొచ్చామన్నారు.  ఈహెచ్‌ఎస్ పథకంలో ఇప్పటికే 354 ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా, మరికొన్ని ఆసుపత్రులను డీమ్డ్ ఎంప్యానెల్ విధానంలో చేర్చినట్లు చెప్పారు. ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి, పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

హెల్త్ కార్డులు జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ పథకాన్ని ఎవరూ అషామాషీగా తీసుకోవద్దని, ఎక్కడా రాజీ పడేది లేదని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సంజయ్ జాజు, జేఏడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ మహేష్ దత్ ఎక్కా, హెల్త్ అండ్ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రెటరి క్రిస్టీనా, ఉన్నతాధికారులు యోగితా రాణా, ఈహచ్‌ఎస్ సీఈఓ హనుమంతు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు