షెడ్యూల్డ్ కులాల రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ
హాజీపూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో షెడ్యూల్డ్ కులాల (SC) రైతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక (DAPSC)(Action Plan for Scheduled Castes Development) కార్యక్రమంలో భాగంగా హాజీపూర్ మండలంలో 150 మంది షెడ్యూల్డ్ కులాల రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. శుక్ర వారం ICAR – డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్, హైదరాబాద్, సేవా స్పూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాజీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO) నిర్వహణలో ఎంపిక చేసిన ఎస్సీ రైతులకు వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే వివిధ రకాల పనిముట్లను అందజేశారు.
ఈ సందర్భంగా రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పంటల ఉత్పాదకత పెంపు, వ్యవసాయ ఖర్చుల తగ్గింపు వంటి అంశాలపై ICAR డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ప్రిన్సిపల్, సైంటిస్ట్ డాక్టర్ ఎం.ఆర్. రెడ్డి, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ లు రైతులకు మార్గ నిర్దేశం చేశారు. వ్యవసాయంలో కూలీల కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆధునిక, ఉపయోగకరమైన వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించడం ద్వారా వారి పనిభారాన్ని తగ్గించి, సమయం, శ్రమను ఆదా చేయడానికి దోహదపడుతాయన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ, శాస్త్రీయ సంస్థల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సేవా స్పూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ పనిముట్లు, శాస్త్రీయ సూచనలు అందుబాటులోకి రావడం వల్ల వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా ఎస్సీ రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
రైతులు అందించిన వ్యవసాయ పనిముట్లను సక్రమంగా వినియోగించుకుని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించి మెరుగైన ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో రైతు ఉత్పత్తిదారుల సంస్థ గౌరవ సలహాదారు శ్యాంసుందర్ రావు, డైరెక్టర్లు పుస్కూరి శ్రీనివాస్ రావు, బొడ్డు శంకర్, బొలిశెట్టి తిరుపతి, సర్పంచ్ భూమయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.