నిండు వర్షం.. నిలువెత్తు విగ్రహాలు
- జోరు వర్షంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం..
- అర్థరాత్రి వరకు కొనసాగిన నిమజ్జనం..
- దగ్గరుండి పర్యవేక్షించిన కలెక్టర్, సీపీ.
ఖమ్మం, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): జై.. జై గణేశా.. జై కొడతా గణేశా.. జయములీవ్వూ బొజ్జ గణేశా.. అని నవరాత్రుల పాటు ఉత్సాహంగా.. ఉల్లాసంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు, ప్రజలు.. ఇప్పుడు బై..బై గణేశ.. మళ్లీ రా గణేశా.. జయము లివ్వు గణేష్ అంటూ ఆటపాటలతో సందడి చేస్తూ వినాయక విగ్రహాలను(Vinayaka idol) ప్రశాంత నిమజ్జనం చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు వినాయకుడు నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తిభావంతో జరుపుకున్నారు.
అర్ధరాత్రి వరకు విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. ఒక వైపు జోరు వర్షం కురుస్తున్నప్పటికి భక్తులు, అధికారులు నిండు వర్షంలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖమ్మం జిల్లా 25 చోట్ల నిమజ్జనం కేంద్రాలను అధికారులు పోలీసులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, ఫైర్ అధికారులు విధులను నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా చాలా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కార్యక్రమం ముగిసింది.
ఖమ్మం లో భారీ బందోబస్తు నడుమ నిమజ్జనం
ఖమ్మం నగరంలో దంసలాపురం, ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వద్ద నిమజ్జనం కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనం వేడుకలను జిల్లా కలెక్టర్ దివాకర్, పోలీస్ కమీషనర్ సునిల్ దత్ దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. అర్థరాత్రి వరకు కేంద్రం వద్ద ఉండి అధికారులకు, భక్తులకు సూచనలు, సలహాలందించారు.
జోరు వర్షం.. బొలేడన్ని విగ్రహాలు..
ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు నిమజ్జనం కార్యక్రమం కొనసాగింది. ఖమ్మం లోని రెండు ప్రాంతాలకు, కూసుమంచి మండలం జీళ్ళచెరువు, వైరా రిజర్వాయర్ కు, ప్రతి మండలంలో ఒక నిమజ్జనం స్పాట్ కు భారీగా విగ్రహాలు వచ్చాయి.. అన్ని విగ్రహాలు వచ్చిన అధికారులు చాలా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదిలా ఉంటే ఒక వైపు జోరు వర్షం.. అర్థరాత్రి.. అయినప్పటికీ వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం దిగ్వీజయంగా సాగింది.
భక్తులు ఆటపాటలు, కోలాటాలతో వినాయక విగ్రహాలను ఊరేగింపుగా చెరువుల వద్దకు తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు. జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధికారులు, సిమ్మర్స్ , పంచాయతీ, రెవెన్యూ, ఎలక్ట్రికల్, ఫైర్ అధికారులు, ఉద్యోగులు పనిచేశారు.