భూముల రీ సర్వే వేగం చేయాలి
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వే(Land re-survey) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూముల రీ సర్వే ప్రక్రియపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన రీ సర్వే వివరాలు, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న 16 సర్వే యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, 16 ప్రత్యేక బృందాల ద్వారా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతి సర్వే బృందంలోని సిబ్బంది సమన్వయంతో, నిర్దేశిత విధానాలను పాటిస్తూ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. భూమి యజమాని, సరిహద్దు భూముల రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి, ఎటువంటి వివాదాలకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
సర్వే నిర్వహించే తేదీ, సమయానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే సంబంధిత రైతులకు తెలియజేయాలని సూచించారు. అలాగే, గ్రామాల వారీగా సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయడంతో పాటు ఖచ్చితమైన మ్యాపులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏ.డీ. ల్యాండ్ సర్వే రికార్డ్స్ విఠల్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.