ఆస్పత్రిలో డ్యూటీ టైమ్‌కు డాక్టర్లు డుమ్మా

07-09-2026 | 04:23pm

సమయపాలనకు మంగళం..

పినపాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సమయపాలన అటకెక్కింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా పినపాక వైద్యాధికారి చాంబర్‌ ఖాళీగా దర్శనమివ్వడం, రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడడం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఎమ్మెల్యే హెచ్చరించినా మారని తీరు

కొద్ది రోజుల క్రితం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని, రోగులకు అందుబాటులో ఉండాలని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. అయితే ప్రజాప్రతినిధి హెచ్చరికలను సైతం ఆ వైద్యాధికారి బేఖాతరు చేస్తున్నారనడానికి తాజా పరిణామాలే నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు.

గంటల తరబడి రోగుల అవస్థలు

దూర ప్రాంతాల నుంచి నొప్పులతో, అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తున్న రోగులు వైద్యాధికారి రాక కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కనీసం కూర్చునేందుకు కూడా ఇబ్బందులు పడుతూ క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నా.. వైద్యుల నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదని రోగులు వాపోతున్నారు. అత్యవసర వైద్యం అందక రోగులు నానా తంటాలు పడుతున్నారని చెబుతున్నారు.

సిబ్బంది సమాధానం దాటవేత ధోరణి

వైద్యుడు ఎప్పుడు వస్తారని ఆసుపత్రి సిబ్బందిని రోగులు ఆరా తీస్తే.. ‘‘మాకు ఎలాంటి సమాచారం లేదు.. ఎప్పుడు వస్తారో మాకు తెలియదు’’ అంటూ సిబ్బంది సమాధానం ఇస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఒకవైపు రోగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే.. వైద్యాధికారి సమయానికి విధులకు హాజరుకాకపోవడం పట్ల స్థానికులు, రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలనే లక్ష్యానికి ఇలాంటి అధికారుల తీరు తూట్లు పొడుస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు (DMHO), ఉన్నతాధికారులు స్పందించి పినపాక వైద్యాధికారి తీరుపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, నిత్యం ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు