అమ్రాబాద్‌లో దారుణ హత్య కలకలం
మృతదేహాన్ని సంచిలో పెట్టి ఇంట్లో ఉంచి కుటుంబం పరారీ
అచ్చంపేట, సెప్టెంబర్ 07: నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన బురానుద్దీన్ హత్య(Murder)కు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులే హత్య చేసి, మృతదేహాన్ని సంచిలో పెట్టి ఇంట్లోని ఓ గదిలో ఉంచి మూడు రోజులుగా ఇంటికి తాళం వేసి పరారైనట్లు సమాచారం.
బురానుద్దీన్ భార్య, ఇద్దరు కుమారులు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన అనంతరం ఇంటికి తాళం వేసి వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఇంటికి వెళ్లి పరిశీలించారు.
ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం సంఘటనా స్థలానికి సీఐ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీ తదితర వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానుంది.
