7 September, 2026 | 8:32 AM

విద్యార్థుల గోస పట్టదా?

07-09-2026 | 05:10am
  1. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడంపైనే శ్రద్ధ
  2. ఫీజు బకాయిలు ఇవ్వాలన్న ధ్యాసే లేదు  
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు  

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి) : రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద ఉన్న  శ్రద్ధ.. ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోస మీద ఎందుకు లేదు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) ప్రశ్నించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం కాలేజీ గడప దాటడం లేదని మండిపడ్డారు. రేపటి తెలంగాణను నిర్దేశించాల్సిన యువతను.. నేడు సర్టిఫికెట్ల కోసం నడిరోడ్డు మీద నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు స్పందించారు. ఎంతోమంది విద్యార్థులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని, ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసినా.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చదివి, కార్పొరేట్ కంపెనీల్లో 6, 7 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించినా.. ఆఫర్ లెటర్లు చేతిలో పట్టుకుని సర్టిఫికెట్ల కోసం ఏడుస్తూ కూర్చోవాల్సిన దుస్థితిని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థుల జీవితాలు బలవుతున్నాయని, తల్లిదండ్రుల కలలు కల్లలు అవుతున్నాయని వాపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్న ఒకే ఒక్క సదుద్దేశంతో.. కేసీఆర్ ఏనాడూ పథకాన్ని ఆపలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంటే  రేవంత్‌రెడ్డికి ఎందుకంత వివక్ష అని మండిపడ్డారు. ఇప్పటికైనా మొండి వైఖరి వీడి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


మరిన్ని వార్తలు