దూదేకుల, నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్ర ముస్లిం, నూర్ బాషా దూదేకుల వెనుకబడిన తరగతుల సంక్షేమ జేఏసీ
ముషీరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నూర్బాషా, దూదేకుల ముస్లింల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (ఫెడరేషన్)ను (Co-operative Corporation) తక్షణమే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్బాషా, దూదేకుల వెనుకబడిన తరగతుల సంక్షేమ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ వైస్ ఛైర్మన్ మహమ్మద్ రాజ్ అహ్మద్ (JAC Vice Chairman Mohammed Raj Ahmed) మాట్లాడారు.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2010 మే 3న విడుదల చేసిన జీవో 125 ద్వారా దూదేకుల ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యాభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఈ ఫెడరేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
జీవో జారీ అయి 16 ఏళ్లు గడిచినా తెలంగాణలో కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది దూదేకుల కుటుంబాలు ఆర్థిక సహాయం, స్వ యం ఉపాధి, విద్యా పథకాలకు నోచుకోక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 125ను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ నాయకులు, మహమూద్ రఫీ, నసీరొద్దీన్, చంద్ పాషా, షాజహాన్, యాకుబ్ పాల్గొన్నారు.






