కరెంటు కోతలతో రైతుల ఆగ్రహం… రోడ్డెక్కిన అన్నదాతలు

10-09-2026 | 02:49pm

కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా

గంభీరావుపేట,సెప్టెంబర్,10(విజయక్రాంతి): మండలంలో కొనసాగుతున్న విద్యుత్ కోతలపై రైతులు(Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట, దమ్మన్నపేట గ్రామాలకు చెందిన రైతులు లింగన్నపేట సబ్‌స్టేషన్ సమీపంలో కామారెడ్డి–సిద్దిపేట ప్రధాన రహదారిపై(Kamareddy–Siddipet Main Road) ధర్నాకు దిగారు. ఇదే సమయంలో దమ్మన్నపేట గ్రామ రైతులు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని, లో వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయని వాపోయారు.సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. డీఈతో ఫోన్‌లో మాట్లాడించగా రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఏఈ ఆనంద్ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో గాండ్ల రాజాం, సందీప్ రెడ్డి, మెతుకు రాజు, పత్తెం ఆంజనేయులు, కొండం ఎల్లం, గుమ్మడి భిక్షపతి, మేకల నారాయణ, పాతూరి బాల్ రెడ్డి, మంద రవీందర్, శాదల రామచంద్రం, బండ దేవరాజు, రాజి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు